Crime: భార్యా భర్తల బంధం అంటేనే ఒక నమ్మకం. ట్రస్ట్ అనేదే లేకపోతే ఈ బంధం ఒక్క క్షణం కూడా నిలబడదు. మనస్పర్ధలు వస్తే సర్దుకుపోవడం, ఇద్దరూ సమానమే అని అనుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ఇవన్నీ కీలకమే. కానీ ఆ ఓపిక చాలా మందికి ఉండడం లేదు. బిజీ జీవితాలు, ఆర్థిక ఇబ్బందులు, వీటికి తోడు అనుమానాలు, వివాహేతర సంబంధాలు, వ్యామోహాల మోజులో ఇవన్నీ జరుగుతున్నాయ్. లేటెస్ట్ గా జరిగిన మహిళల మర్డర్స్ సమాజంలో పరిస్థితులు ఎంతకు దిగజారాయోనన్న విషయాన్ని బయటపెడుతున్నాయి.
సమాజం ఎటెళ్తోందన్న భయాలు
సొసైటీలో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. కట్టుకున్న భార్యను చంపి శరీరాన్ని కోసేంత క్రూరత్వం ఎలా వస్తోంది? ఎందుకిలా రాక్షసుడిగా మారాడు? బేధాభిప్రాయాలు ఉంటే.. గొడవలు వస్తే ఎవరికి వారు బతకొచ్చు.. అంతేగానీ.. ఇలా ప్రాణాలు తీస్తారా.. ఎవరి బతుకు వారిని బతకనివ్వాలి కదా.. కానీ సమాజంలో ఇదే జరగడం లేదు. స్వాతి విషయమే చూస్తే.. ఆమె నాలుగు నెలల గర్భిణి కూడా. కడుపులో ఉన్న బిడ్డతో సహా కట్టుకున్న భార్యను కడతేర్చాడు మహేందర్. ఇంతకంటే ఘోరం ఉంటుంది. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. మొన్నామధ్య మీర్‌పేట్‌లో భార్యను చంపి ఆధారాలు లేకుండా చేసిన ఘటన తరహాలోనే మహేందర్ ప్లాన్ చేయడం చూస్తుంటే సొసైటీలో క్రూయల్టీ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.
భార్యా భర్తల బంధం అంటే ఇంతేనా?
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. మధ్యలో గొడవలు జరిగాయి. పెళ్లైన తర్వాత మొదటిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇప్పుడు మళ్లీ ఆమె గర్భిణి. ఏ విషయంలో గొడవ జరిగిందో తెలియదు గానీ.. చంపేశాడు. బోడుప్పల్‌లోని బాలాజీహిల్స్‌లో నెల కిందటే వచ్చారు. మహేందర్ రాపిడో బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు. స్వాతి ఇంటి దగ్గరే ఉంటోంది. క్షణికావేశమా.., ఇద్దరి మధ్య పొరపొచ్చాలా.. ఏం జరిగిందో గానీ.. దారుణం జరిగిపోయింది. ప్రతాప సింగారం దగ్గర్లోని మూసీలో శరీర భాగాలను పడేసినట్లు చెప్పడంతో క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్కాడ్ , డీఆర్ఎఫ్ బృందాలతో శరీర భాగాల కోసం గాలిస్తున్న పరిస్థితి. మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ పరీక్షలు చేశాక అప్పగించనున్నారు. అటు కామారెడ్డిగూడలో ముందు జాగ్రత్తగా పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు. మహేందర్ కుటుంబీకులు ఊరి నుంచి వెళ్లిపోయారు. తమ బిడ్డ చనిపోయిందని తెలుసుకున్న వారి తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరం కావట్లేదు.
భార్యపై అనుమానంతో కడతేర్చిన శ్రీశైలం
ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు శ్రావణి. ఈమె కథ కూడా విషాదాంతమైంది. ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దేవరకద్ర మండలానికి చెందిన శ్రావణికి నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలానికి చెందిన శ్రీశైలంతో 2014లో పెళ్లైంది. వీరిద్దరి పరిచయం రాంగ్ కాల్ ద్వారా ఏర్పడి ప్రేమకు దారి తీసి పెళ్లి వరకు వెళ్లింది. రాంగ్‌కాల్‌తో ఏర్పడిన వీరిద్దరి బంధం.. రాంగ్ రూట్ లో కథను విషాదంగా ముగిసేలా చేసింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సోమశిలకు వెళ్దామని చెప్పి అక్కడే హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వీరిద్దరి బంధంలో అనుమానమే పెను భూతమైంది.
శ్రావణి-శ్రీశైలం దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో శ్రావణి కొన్నాళ్లుగా పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. శ్రీశైలం యూసుఫ్ గూడలో పని చేస్తున్నాడు. తరచూ గొడవలు పడుతుండడంతో విసిగిపోయిన ఆమె జనవరిలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కూడా. ఈ క్రమంలో సోమశిలకు వెళ్దామని నమ్మించిన శ్రీశైలం ఆగస్ట్ 21న మహబూబ్‌నగర్‌కు వచ్చి, భార్యను బైక్‌పై తీసుకెళ్లాడు. పథకం ప్రకారం కత్తి, పెట్రోల్‌ను బైక్ కవర్‌లో ఉంచుకున్నాడు. పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత మృతదేహానికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
చంపితే నష్టపోయేది ఎవరు?
నమ్మకం లేని చోట బంధం నిలబడదు. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఎవరి బతుకు వారు బతకాలి. దూరంగా ఉండాలి. విడిపోయే అవకాశమూ ఉంది. కానీ అనుమానంతో కడ తేర్చడం ఎంత వరకు కరెక్ట్? ఎందుకు ఆలోచించడం లేదు.. మరి పుట్టిన పిల్లల పరిస్థితి ఏం కావాలి.. తల్లి చనిపోయి, తండ్రి జైలుకెళ్తే.. పిల్లల ఆలనా పాలనా చూసుకునేదెవరు? ఇవేమీ ఆలోచించడం లేదు. చంపడం ఒక్కటే టార్గెట్ గా పెట్టుకుంటున్నట్లు తాజాగా జరిగిన ఘటనలు చూస్తే అర్థమవుతుంది.
మొన్నటిదాకా భర్తల్ని చంపిన భార్యలు.. ఈ వ్యవహారం డైలీ సీరియల్ లా సాగాయి. ఇప్పుడు మళ్లీ భార్యల్ని చంపుతున్న భర్తలు ఇష్యూస్ నడుస్తున్నాయి. ఎన్నాళ్లు ఇలా..? నిండు నూరేళ్ల దాంపత్యం.. ఏదో ఒక సమస్యతో ఇలా అర్ధాంతరంగా ముగియాల్సిందేనా? పెళ్లిరోజు చేసిన ప్రమాణాలు ఏమవుతున్నాయ్.. వేసిన ఏడడుగుల బంధం ఏమవుతోంది? ఇది ఏఐ యుగం. అయినా సరే అవే వరకట్న వేధింపులు, అవే అనుమానాలు… అదనపు కట్నం కోసం నోయిడాలో జరిగిన ఘోరం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
కన్నకొడుకు ముందే ఆర్తనాదాలతో తల్లి మృతి
అంటూ తెలిసీ తెలియని వయసులో తన కళ్లముందు జరిగిన ఘోరాన్ని చెప్పాడు ఈ పిల్లాడు. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయింది. పాపం పసివాడు. పిల్లాన్ని కడుపులో పెట్టుకుని చూసే ఈ తల్లికి కొడుకు కళ్లముందే ఎంత కష్టం వచ్చింది…? కన్నతల్లి కళ్లముందు ప్రాణభయంతో కేకలు వేస్తుంటే ఏమీ చేయలేకపోయాడు ఆ పిల్లాడు. ఏం జరుగుతుందో అర్థం కాని వయసు. తండ్రిని నిలువరించలేని పసితనం. గొడవ జరుగుతుంటే ఆపలేని పరిస్థితి. ఇంతటి ఘోరం ఉంటుందా? ఆ పసి మనసు ఎంత గాయపడి ఉంటుంది?
నిక్కీ-విపిన్ కు 2016 డిసెంబర్ లో పెళ్లి
ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట. నిక్కీ, విపన్. ఉండేది గ్రేటర్ నోయిడాలో. వీరిద్దరికి 2016 డిసెంబర్ లో పెళ్లైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కట్న కానుకలు కూడా నిక్కీ తండ్రి బాగానే ఇచ్చాడు. అయినా సరే విపిన్ కుటుంబానికి వరకట్న దురాశ తగ్గలేదు. పిల్లాడు పుట్టినా సరే డబ్బు కావాల్సిందే అన్నారు. ఇది ఏఐ జమానా నడుస్తున్నా.. ఇంకా వరకట్న పిశాచులు ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం. అసలు పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలే దొరకని పరిస్థితులు ఉన్నాయి. చూడచక్కనైన రూపం, మంచి గుణం ఈ రెండూ ఉన్న నిక్కీ.. ఓ దుర్మార్గుడికి భార్యగా మారి ఇదిలో ఇలా అర్ధాంతరంగా వరకట్న మంటల్లో బలైపోయింది.
35 లక్షల క్యాష్, స్కార్పియో, బుల్లెట్ బండి అంటూ డిమాండ్లు
నిక్కీ-విపిన్ పెళ్లైన తర్వాత కూడా 35 లక్షల క్యాష్ కావాలి.. స్కార్పియో కావాలి.. బుల్లెట్ బండి కావాలంటూ షరతులు పెట్టారు. డిమాండ్ చేశారు. సరే అని అది ఇచ్చాక.. విపిన్ కుటుంబీకుల బుద్ధి మారలేదు. నిక్కీ తండ్రిని గట్టిగా అడిగితే ఇస్తున్నాడు కదా అని ఈసారి.. కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. మెర్సిడెస్ కారు కావాలి.. 60 లక్షల క్యాష్ ఇవ్వాలన్నారు. ఏ కాలంలో ఉన్నారు.. ఏం పని చేస్తున్నారు..? ఈజీ మనీ కోసం ఇంతలా దిగజారాలా? అని సభ్య సమాజం అనుకున్న ఘటన ఇది. ఆగస్ట్ 21న నిక్కీని ఆమె కొడుకు ముందే విపిన్ సహా అతడి కుటుంబీకులు దారుణంగా కొట్టారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచింది నిక్కీ. ఈమె మరణాన్ని చూసి దేశమంతా అయ్యో పాపం అనుకుంటోంది. పారిపోయిన విపిన్ ను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టులు జరుగుతున్నాయ్. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిక్కీ కుటుంబం డిమాండ్ చేస్తోంది. విపిన్ ఇంటిపై బుల్డోజర్లు తీసుకెళ్లాలని నిక్కీ తండ్రి అంటున్నారు. యూపీ మహిళా కమిషన్ రిపోర్ట్ అడిగింది.
పెళ్లైన నాలుగు నెలలకే బలైన గౌతమి
ఇక్కడ చూడండి.. ఈ జంటది మహబూబాబాద్ జిల్లా. ఉండేది వరంగల్ హంటర్ రోడ్. పేర్లు గౌతమి, గణేష్. పెళ్లై నాలుగు నెలలు అవుతోంది. గణేష్ ఆటో డ్రైవర్. పెళ్లి టైంలో 20 లక్షల కట్నం, 150 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. అయినా సరే అదనపు కట్నం కోసం భార్యనే కడతేర్చాడు. గుండెపోటు అని నమ్మించే యత్నం చేశాడు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తమ బిడ్డను కొన్ని రోజులుగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని పేరెంట్స్ అంటున్నారు.
అశ్వారావుపేట లక్ష్మీప్రసన్న అనుమానాస్పద మృతి
ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి పేర్లు లక్ష్మీప్రసన్న, నరేశ్ బాబు. 2015లో పెళ్లింది. ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. అయితే లక్ష్మీప్రసన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మెట్లపై నుంచి పడిందన్నారు. హాస్పిటల్ లో లక్ష్మీప్రసన్న పేరెంట్స్ ఆమెను చూడగానే ఎముకలగూడులా కనిపించింది. శరీరమంతా గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండటంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి టైంలో రెండెకరాల మామిడి తోట, అరెకరం పొలం, 10 లక్షల క్యాష్, మరో 10 లక్షలు విలువ చేసే బంగారం కట్నంగా ఇచ్చారు. ఇంత చేసిన పేరెంట్స్ తో బిడ్డను చూడనివ్వలేదని వాపోతున్నారు. ఫోన్ చేసినా మాట్లాడనిచ్చే వారు కాదంటున్నారు. ఇప్పుడు వారి బిడ్డ బలైపోయింది.
భర్తలు పెట్టే టార్చర్ మౌనంగా భరిస్తున్న వారెందరో..
ఈ కథ ఈ వ్యధ ఒక నిక్కీ, ఒక గౌతమి, ఒక లక్ష్మీ ప్రసన్నదే కాదు.. చాలా మంది వివాహితలది. భర్తలు పెట్టే టార్చర్ ను భరిస్తూ, కుటుంబం పిల్లలు వీధిన పడొద్దన్న ఉద్దేశంతో ఎన్ని వేధింపులు ఉన్నా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా లోలోపల కుమిలిపోతూ బతుకీడుస్తున్న వారెందరో మన సమాజంలోనే మన మధ్యే ఉన్నారు. వీళ్ల ఆవేదన ఎవరికి అర్థం కావాలి? వాళ్ల ఆర్తనాదాలు ఎవరికి వినిపించాలి? ఘోరం, విషాదం.. దారుణం ఇలాంటి పదాలు చాలా తక్కువ.
సోషల్ మీడియా అతిగా వాడకంతో అనర్థాలు
భార్యా భర్తల బంధం బీటలు వారడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వ్యక్తిగత స్వాతంత్రం, కెరీర్, లైఫ్ స్టైల్స్ మారడం, ఒకరి భావాలను, అవసరాలను మరొకరు అర్థం చేసుకోకపోవడం. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఇళ్లల్లో ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సోషల్ మీడియా అతిగా వాడడంతో అనుమానాలు, అపనమ్మకాలు పెరుగుతున్న పరిస్థితి. అనుమానం, కోపం, కుటుంబ ఒత్తిళ్లు, వివాహేతర సంబంధాలు, ఆధిపత్య ధోరణి, మద్యానికి, డ్రగ్స్ బానిస అవడం ఇవన్నీ హింసకే దారి తీస్తున్నాయి. గృహ హింస నేరమని తెలియకపోవడం, శిక్షల గురించి భయం లేకపోవడం కూడా ఇలాంటి హత్యల దాకా వెళ్తోంది.
Also Read: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!
భార్యా భర్తల మధ్య సంబంధం బలపడాలంటే.. ఒకరి అభిప్రాయాలు, భావాలను గౌరవించుకోవడం ముఖ్యం. ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడటం ఫస్ట్ ఆపేయాలి. మంచి రిలేషన్ కోసం చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయాలి. అనుమానాలు ఉంటే వాటిని సెన్సిటివ్ గా చర్చించాలి. చిన్న తప్పులను క్షమించడం, ఎవరు తప్పు చేసినా అవసరమైతే క్షమాపణ చెప్పడం ముఖ్యం. ఇక కలిసి బతకలేం అనుకున్నప్పుడు కిరాతకంగా హత్యలు చేయడం, పిల్లలను అనాథలుగా చేసే కంటే విడాకులు తీసుకుని దూరంగా ఎవరి బతుకు వారు బతకడమే మేలు.
Story By Vidya Sagar, Bigtv