Tamil Nadu News : తమిళనాడులో ఘోర పేలుడు సంభవించింది. ఇక్కడ బాణాసంచా కర్మాగారాలు ఎక్కువగా ఉండడంతో..వాటిలోని ఓ కర్మాగారంలో శనివారం తెల్లవారుజామున పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని సత్తూరు సమీపంలోని బొమ్మయ్య పురం గ్రామంలోని బాణాసంచా యూనిట్‌లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రం దగ్గర శనివారం ఉదయం కార్మికులు బాణాసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాబహుడిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విరుదునగర్, సత్తూరు, అరుప్పుకోట్టై నుంచి అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రమాద స్థలం నుంచి ప్రస్తుతానికి ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారు ఎవరనే విషయాన్ని నిర్థరించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం విరుదునగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించనున్నారు.
Also Read : ఆఫీసులో కుట్ర.. గర్భవతి సహోద్యోగికి విషం పెట్టిన మహిళ.. పని ఒత్తిడి వల్లేనా?!
కాగా.. తమిళనాడులో ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరంలో ఇదే తొలి బాణాసంచా ప్రమాదం కావడం గమనార్హం.