Kurnool News: కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన గ్రామాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. చిగిలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
చిగిలి గ్రామంలోని నీటికుంటలో ఆరుగురు ఐదో తరగతి విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే పిల్లలు అందరూ ఒకేసారి కుంటలోకి దిగారు. ఆ నీటకుంట లోతు తెలియక పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే రక్షంచే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ఐదో తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ పిల్లలకు ఈత రాకపోవడం వల్లే మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గ్రామంలో ఆరుగురు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటన నీటి వనరుల వద్ద భద్రతా చర్యల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతిపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
స్పందించిన మాజీ సీఎం జగన్
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఆరుగురు చిన్నారులు మృతిచెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
ALSO READ: Hyderabad News: దారుణం.. భర్తతో గొడవ పెట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి
ALSO READ: Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?