Beggar Murder Scam| లక్షల రూపాయలు వస్తాయని ఒక బిచ్చగాడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. కానీ చిన్న తప్పు చేయడం వల్ల పోలీసుల విచారణలో వారి బండారం బయటపడింది. ఇదంతా పెద్ద స్కామ్ అని తెలుసుకున్న పోలీసులు ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. కానీ హత్య కేసులో అసలు మాస్టర్ మైండ్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 1, 2024న రాజస్థాన్ లోని బన్వారా జిల్లా ఝేర్బాడీ గ్రామం నేషనల్ హైవే 56 వద్ద పోలీసులకు ఒక పురుషుడి మృతదేహం లభించింది. ఏదో రోడ్డు ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. శవం వద్ద నుంచి నరేంద్ర సింగ్ రావత్ అనే వ్యక్తి ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు లభించాయి.
ఆ తరువాత పోలీసులు ఆ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ తరువాత నరేంద్ర సింగ్ కుటుంబానికి సమాచారం అందించారు. కానీ ఆ కుటుంబ సభ్యులు ఆ శవం చూసి గుర్తుపట్టడానికి కష్టంగా ఉందని చెప్పారు. దీంతో ఆ శవం నరేంద్ర సింగ్ దేనని ధృవీకరణ జరగలేదు. పోలీసులకు ఆ మృతదేహం కేసులో అనుమానం కలిగింది. అసలు ఆ శవం ఎవరిది? హైవేపై ఎందుకు ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం లభించలేదు.
Also Read: భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య.. చిన్నపిల్ల ద్వారా బయటపడిన బండారం
ఈ కేసులో సీరియస్ గా విచారణ చేసిన పోలీసులు ముందుగా నరేంద్ర సింగ్ ఏమయ్యాడు? అనే కోణంలో దర్యాప్తు చేశారు. అతని ఫోన్ ట్రాక్ చేస్తే.. చివరగా అతను నవంబర్ 30న ఘటనా స్థలంలో అంటే నేషనల్ హైవే 56పై ఉన్నట్లు తెలిసింది. పైగా నరేంద్ర సింగ్ తో భేరు లాల్ అనే వ్యక్తి ఫోన్ లో మాట్లాడినట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా తెలసుకున్నారు. దీంతో భేరు లాల్ కోసం అన్వేషించి పట్టుకున్నారు. అప్పుడు మొత్తం స్కామ్ బయటపడింది. భేరులాల్ మరో ఇద్దరితో కలిసి ఒక బిచ్చగాడిని హత్య చేశాడు. ఆ మిగతా ఇద్దరు నిందితులలో ఒకరు ట్రక్ డ్రైవర్ ఇబ్రాహీం కాగా.. మరొకరు ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాస్టర్ మైండ్ అయిన నరేంద్ర సింగ్ రావత్.
నిజానికి నరేంద్ర సింగ్ రావత్ పేరు పైన రూ.30 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది. అతను బిజినెస్ లో బాగా నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. ఇక దిక్కు తోచని పరిస్థితిలో అతను ఒక ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు భేరులాల్ సాయంతో ఒక బిచ్చగాడు అయిన తుఫాన్ బైరవ అనే వ్యక్తిని కలిశారు. ఆ బిచ్చగాడు దాదాపు నరేంద్ర సింగ్ శరీర ఆకారంలో పోలి ఉన్నాడు. అతడికి గుజరాత్ లో డబ్బులు ఇస్తామని ఆశ చూపించి, కొంత డబ్బులు కూడా ఇచ్చారు. ఆ తరువాత నవంబర్ 30, 2024 రాత్రి నేషనల్ హైవే 56 వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముందుగానే సిమెంట్ తో నిండిన ట్రక్కుతో ఇబ్రాహీం ఎదురుచూస్తున్నాడు.
అక్కడ బిచ్చగాడైన తుఫాన్ బైరవను స్పీడగా వస్తున్న ట్రక్కు కిందకు నరేంద్ర, భేరులాల్ కలిసి తోసేశారు. కానీ ఆ బిచ్చగాడు చావలేదు.. తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. దీంతో ట్రక్కు డ్రైవర్ ఇబ్రాహీం అతని రివర్స్ లోకి వెళ్లి మరీ ట్రక్కు కింద తొక్కి చంపాడు. ఈ పని చేసినందుకు భేరులాల్ రూ.85,000 తీసుకోగా.. ట్రక్కు డ్రైవర్ ఇబ్రాహీంకు రూ.65,000 అందాయి. చనిపోయిన బిచ్చగాడు రాజస్థాన్ లోని చిత్తర్ గడ్ కు చెందినవాడని పోలీసులకు తెలసింది.
ఆ తరువాత పోలీసులు ట్రక్కు డ్రైవర్ ఇబ్రాహీంను కూడా అరెస్టు చేశారు. కానీ ప్రధాన నిందితుడు నరేంద్ర సింగ్ రావత్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. ఈ కేసులో నరేంద్ర సింగ్ చేసిన చిన్న తప్పిదమే మొత్తం బండారం బయటపడేసింది. అదే ఆ శవాన్ని అతని కుటుంబ సభ్యులు గుర్తు పట్టకపోవడం.