Varanasi Gang Rape: యూపీలో మరో కీచకపర్వం బయటపడింది. వారణాసికి చెందిన 19 ఏండ్ల యువతిపై ఏడు రోజుల పాటు 23 మంది పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 29న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సదరు యువతి ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి వచ్చింది. తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
మార్చి29న మిస్సింగ్..
వారణాసి పాండేపూర్ లాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివసిస్తున్న ఓ యువతి మార్చి 29న తప్పపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 4న ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. తనను అపహరించి ఏడు రోజుల పాటు ఏకంగా 23 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులకు వివరించింది. ఒకరి తర్వాత మరొకరు గంటల తరబడి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది.
11 మందిపై కేసు, ఆరుగురు అరెస్ట్
బాధిత యువతి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వారణాసి డిప్యూటీ కమిషనర్ వరుణ జోన్ చంద్రకాంత్ మినా తెలిపారు. రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్ తో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు వివరించారు.
డ్రగ్స్ ఇచ్చి మరీ సామూహిక అత్యాచారం
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బాధిత యువతి మార్చి 29న కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా రాజ్ విశ్వకర్మ కలిశాడు. అతడు ఆమెను కేఫ్ కు తీసుకెళ్లాడు. ఆమె కూడా ఇష్టంగా వెళ్లింది. ఆ తర్వాత ఆమెను అక్కడే అత్యాచారం చేశాడు. మరుసటి రోజు అతడు తన ఫ్రెండ్ సమీర్ తో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నాదేసర్ దగ్గర ఆమెను వదిలిపెట్టారు. మార్చి 31న, ఆమెను సోహెల్, అన్మోల్, డానిష్, సాజిద్, జహీర్ అనే వ్యక్తులు ఆమెకు మత్తుమందు ఇచ్చి మరో కేఫ్‌లో అత్యాచారం చేశారు. ఏప్రిల్ 1న, సాజిద్, అతడి స్నేహితులు ఆమెను ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె మీద అత్యాచారం చేశారు. హోటల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇమ్రాన్ మళ్లీ అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఆమె ఔరంగాబాద్‌లోని ఒక గోడౌన్ నుంచి తప్పించుకుని సిగ్రాలోని ఒక మాల్ ముందు కూర్చుంది. ఆమెన రాజ్ ఖాన్, అతని స్నేహితులు కలిసి మత్తు కలిపిన నూడుల్స్ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్ ఆమెను అత్యాచారం చేసి అస్సీ ఘాట్‌లో వదిలి వెళ్ళాడు. మత్తు కారణంగా ఆమె అక్కడే పడుకుంది. ఆమెను డానిష్ అనే వ్యక్తి ఒక హోటల్‌కు తీసుకెళ్లి సోహైల్, షోయబ్ తో పాటు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను బయట వదిలేశారు. బాధితురాలు తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి. అక్కడి నుంచి తన ఇంటికి చేరుకుంది.
కుటుంబ సభ్యులకు విషయం చెప్పిన బాధితురాలు
ఏప్రిల్ 4న సదరు యువతి.. స్నేహితురాలి ఇంటి నుంచి తన ఇంటికి వచ్చింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం మూడు బృందాలు గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అదే సమయంలో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.
Read Also: వృద్ధాశ్రమానికి వెళ్లనన్న అత్త, జుట్టుపట్టి కింద పడేసి.. నేలపై ఈడ్చి.. నెట్టింట వీడియో వైరల్!