మనుషులలో రోజు రోజుకు మానవత్వం చచ్చిపోతుందని చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహారణ. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాళ్లే, కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు అయిన అత్తపై ఓ కోడలు అమానుషంగా ప్రవర్తించింది. జుట్టుపట్టుకుని కిందపడేసి, లాక్కెళ్లింది. ఇష్టానుసారంగా కొడుతూ చిత్రహింసలకు గురించి చేసింది. అదే సమయంలో ఆమె సోదరుడు, తండ్రి భర్త మీద దాడి చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగింది. ఈ దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గ్వాలియర్ లో విశాల్ బాత్రా అనే వ్యక్తి కార్లు స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్ రన్ చేస్తున్నాడు. అక్కడే తన తల్లి సరళ, భార్య, కొడుకుతో కలిసి ఉంటున్నాడు. గ్వాలియర్ లో అతడికి మంచి భవంతి కూడా ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ, ఈ నెల 1న అతడి బామ్మార్ది, మామతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. రావడంతోనే విశాల్ మీద దాడి చేశాడు మామ. చెంప మీద కొట్టాడు. తిరిగి విశాల్ అతడిని కొట్టబోయాడు. వెంటనే అతడి బామ్మార్ది, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ మీద దాడి చేశారు.
అత్తని విచక్షణా రహితంగా కొట్టిన కోడలు
అటు తన కొడుకును కొట్టొద్దంటూ తల్లి సరళ అడ్డు పడింది. వెంటనే ఆమె కోడలు అక్కడికి పరిగెత్తుకొచ్చింది. అత్త జుట్టు పట్టుకుని కిందపడేసి లాక్కెళ్లింది. ఆమె మీద ఇష్టారీతిన దాడి చేసింది. చేతితో గుద్దింది. లేచేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమెను లేవకుండా కొట్టింది. అటు విశాల్ ను మామ, బామ్మార్ది బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ దాడి సమయంలో విశాల్ కొడుకు భయంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితితో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు.అనంతరం సరళను కూడా ఇంటి నుంచి బయటకు గెంటేసి తాళం వేసుకుని వెళ్లిపోయారు.
Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr
— IANS (@ians_india) April 4, 2025
దాడి విజువల్స్ సీసీటీవీలో రికార్డు
తనతో పాటు, తన తల్లి మీద దాడి చేసిన తన భార్య, భార్య బంధువులపై విశాల్ కేసు పెట్టాడు. ఈ సందర్భంగా ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేశారు. తన తల్లిని వృద్ధాశ్రమంలో వేయాలని భార్య తనను వేధించేదని, నో చెప్పడంతోనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడినట్లు చెప్పాడు. “మా అమ్మను ఓల్డేజ్ హోమ్ లో వేయాలని నా భార్య కోరేది. నేను నో చెప్పడంతో రోజూ గొడవ పడేది. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, సోదరుడిని ఇంటికి పిలిపించి, నా మీద, మా అమ్మ మీద దాడి చేయించింది. తన భార్య, ఆమె బంధువుల నుంచి తనకు తన తల్లికి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాం” అని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ‘మనీ హీస్ట్’ చూసి బ్యాంకుకు కన్నం, ఏకంగా 17 కిలోల బంగారం కొట్టేసి..