Crime News : వాడో దొంగ. అందరిలాంటి దొంగ అయితే కాదు. దొంగతనం చేస్తాడు. కానీ, పారిపోడు. సొమ్ములు, బంగారం ఎత్తుకెళతాడు. ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. అక్కడా ఇక్కడా చోరీలు చేయడు. వాడికి సొంతూరంటే ఎంతో ఇష్టం. స్వగ్రామంలోనే చేతివాటం చూపిస్తాడు. తెలిసిన ప్రాంతం, తెలిసిన మనుషులు కావడంతో.. వాడి పని మరింత ఈజీ. ఇళ్లిళ్లూ తెలుసు.. ఎవరింట్లో ఏముంటుందో తెలుసు.. ఎలా లోపలికి దూరాలో, ఏ టైమ్‌లో చోరీ చేయాలో బాగా తెలుసు. అందుకే, పుట్టిన ఊరునే అడ్డాగా చేసుకుని పుట్టెడు దొంగతనాలు చేశాడు. చాకచక్యంగా వ్యవహరిస్తూ.. పోలీసులకు చిక్కకుండా కొంతకాలంగా తప్పించుకుంటున్నాడు. చివరాఖరికి ఎలా దొరికాడంటే….
దొంగే దొంగ అంటూ..
ఆ దొంగ పేరు ప్రశాంత్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి అతని ఊరు. ఓ ఇంట్లో దొంగతనం చేసి.. ఆ తర్వాత బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇప్పించడం అతడి స్టైల్. అయ్యో పాపం అంటూ అమయాకంగా నటిస్తాడు. దొంగ వెధవలను వదలొద్దు అంటూ అతడే దగ్గరుండి మరీ బాధితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతాడు. సార్.. వీళ్లు మా ఊరు వాళ్లే. ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి.. వీళ్లకు న్యాయం చేయాలి అంటూ వకాల్తా పుచ్చుకుంటాడు. దగ్గరుండి మరీ దర్యాప్తును పక్కదారి పట్టించే వాడు. పోలీసులు సైతం అతన్ని నమ్మారు. ఉత్సాహవంతుడైన యువకుడిలా ఉన్నాడు.. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుంటున్నాడు అని అనుకున్నారు. అందుకే అతనిపై ఎప్పుడూ అనుమానం రాలేదు పోలీసులకి. గ్రామస్తులు సైతం ప్రశాంత్ చొరవను మెచ్చుకునే వారు. ఏ సమస్య వచ్చినా అతని దగ్గరికే వెళ్లే వారు. అలా ఆ దొంగ ఊర్లో చోటా లీడర్ అయ్యాడు. కట్ చేస్తే…
గర్భిణీపై హత్యాయత్నం..
4 రోజుల క్రితం వంగపల్లిలో మరో దొంగతనం జరిగింది. ముఖానికి ముసుగు వేసుకుని వచ్చి.. ఓ ఇంట్లో చోరీకి తెగబడ్డాడు. ఆ ఇంట్లోని గర్భిణీ తిరగబడటంతో ఆమెపై దాడి చేశాడు. ఆ పెనుగులాటలో అతడి ముఖానికి ఉన్న ముసుగు ఊడిపోయింది. ప్రశాంత్‌ను ఆ గృహిణి గుర్తించింది. అంతే, అతడు బెదిరిపోయాడు. చంపేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ మహిళ ముఖానికి ముసుగేసి ఊపిరి ఆడకుండా చేసే ప్రయత్నం చేశాడు. తలపై దారుణంగా కొట్టి గాయపడిచాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయిందని భావించి.. ఇంట్లోని బంగారం దోచుకుని.. అక్కడి నుంచి జారుకున్నాడు.
దొంగను గుర్తుపట్టే సరికి..
ఆ తర్వాత ఎప్పటిలానే ఏమీ తెలియనట్టు.. మహానటుడిలా డ్రామా స్టార్ట్ చేశాడు. తమ ఊర్లో దొంగతనం, హత్య జరిగిందంటూ డయల్ 100కి ఫోన్ చేశాడు. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే, గాయపడిన ఆ గర్భిణిని.. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పేసింది. తనపై దాడి చేసింది తమ గ్రామానికే చెందిన ప్రశాంత్ అని పోలీసులకు చెప్పేసింది. ఉలిక్కిపడిన ఖాకీలు.. వాడా ఈ దొంగతనం చేసిందని అవాక్కయ్యారు. అంటే, ఇన్నాళ్లూ వంగపల్లిలో జరిగిన చోరీలన్నీ అతడే చేశాడనే అనుమానంతో ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడి నుంచి 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్‌లో దొంగ తెలివితేటలతో పాటు పోలీసుల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.