Hyderabad Auto Permits: హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో మలుపు తిరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణను గమనంలోకి తీసుకుంటూ, ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) పరిధిలో కొత్తగా ఏకంగా 65 వేల త్రీ వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ట్రాఫిక్ పరంగా కొత్త చరిత్ర సృష్టించబోతుంది.
ఇప్పటి వరకు నగరంలోని ట్రాఫిక్, కాలుష్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కొత్త ఆటోలకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో జీవో నంబర్ 263 ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది.
పెట్రోల్, డీజిల్ ఆటోలకి నో.. గ్రీన్ ఫ్యూచర్‌కే గ్రీన్ సిగ్నల్!
ఈ కొత్త జీవోలో ప్రత్యేకత ఏంటంటే, పెట్టుబడి తగ్గించి, పర్యావరణ హితంగా, కమ్యూనిటీకి ఉపాధిని కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించడం. ఇందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు, 10 వేల LPG ఆటోలకు, 10 వేల CNG ఆటోలకు అనుమతి లభించనుంది. అలాగే 25 వేల డీజిల్, పెట్రోల్ ఆటోల కోసం రేట్రోఫిట్‌మెంట్ అనుమతులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న వాహనాలను మార్చి, ఎలక్ట్రిక్, CNG, LPG లాగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతవరకు, నగరంలోని పాత ఆటోల ట్రాన్స్ఫర్, కొత్త ఆటోల రిజిస్ట్రేషన్‌కు పరిమితులు ఉండగా, ఇప్పుడు ఆ పరిమితిని సడలిస్తూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇది ఆటో పర్మిట్ మాత్రమే కాదు.. జీవన మార్గమే!
ఈ జీవో అమలుతో 65 వేల కుటుంబాలకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మళ్లీ తిరిగి తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వలస వచ్చిన వర్గాలు, పేద కుటుంబాల కోసం ఇది సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం.
పర్యావరణానికి ప్రోత్సాహం
ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల నగరంలో శబ్దం, వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగింది. దీంతో ప్రజలు ఊపిరి తిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త దిశగా ఆలోచింపజేసింది.
అందుకే ఇక నుంచి ఇంధనం వాడే ఆటోలకు గుడ్ బై చెప్పాలని, ఎలక్ట్రిక్, LPG, CNG ఆటోలకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా నగరంలో కాలుష్యం నియంత్రణతో పాటు, శబ్ద మోత తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే మార్గం లభించింది.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ మంచి మనసు.. నాలుగేళ్ల చిన్నారికి ఉచిత వైద్యానికి ఆదేశాలు
అభివృద్ధి దిశగా అడుగులు
ఈ కొత్త జీవోతో గాను ప్రభుత్వ అభివృద్ధి దిశను స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఏర్పడుతున్న లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ లైఫ్‌స్టైల్, టెక్ కంపెనీల విస్తరణ, ఇవన్నీ రవాణా వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయి. అదే దిశగా ఈ మెట్రో ప్లస్ గ్రీన్ ఆటోలు హైదరాబాద్ నగరానికి ఒక మోడల్ సిటీ స్టేటస్ తీసుకురావడంలో సహాయపడతాయి.
ఈ నిర్ణయం చాలా దూరదృష్టితో తీసుకున్నదిగా చెప్పవచ్చు. డబుల్ బెనిఫిట్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఒకవైపు ఉపాధి కల్పన, మరోవైపు పర్యావరణ సంరక్షణ. ప్రధానంగా ఇంధన దరిద్య్రాన్ని తగ్గించడంతో పాటు, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించే తరహాలో ప్రభుత్వ ముందడుగు వేయడం అభినందనీయం.