Bank Robbery Case: వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్‌బీఐ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకులో రాబరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఉత్తర ప్రదేశ్ కు చెందిన అర్షాద్ అన్సారీ, షాఖీర్‌ఖాన్ ఆలియాస్ బోలేఖాన్, హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ గా గుర్తించారు. కీలక నిందితుడితో పాటు మరో నలుడు దొంగలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న వారిలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన అక్షయ్ గజానన్ అంబోర్, సాగర్ భాస్కర్ గోర్ ఉన్నట్లు వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
రూ.1.80 కోట్లు, 2 కిలోల బంగారం స్వాధీనం
వరంగర్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా.. రాయపర్తి బ్యాంక్ చోరీ నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల నుంచి సుమారు రూ. 1.80 కోట్లు విలువ చేసే 5.5 కేజీల బంగారు ఆభరణాలు, ఓ కారు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.?
రాయపర్తి బ్యాంక్ చోరీకి సంబంధించి కమిషనర్ అంబర్ కిశోర్.. పాయింట్ టు పాయింట్ చెప్పుకొచ్చారు. “నవంబర్ 18న అర్థరాత్రి సమయంలో రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో దొంగతనం జరిగింది. ఈ దోపిడీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశాం. మరో నలుగురు నిందితులు పరారీ అయ్యారు. వీరిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ కొద్ది రోజుల క్రితం యూపీ నుంచి తెలంగాణకు వచ్చాడు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల గురించి ఆరా తీశాడు. ఆ తర్వాత యూపీ, మహారాష్ట్రకు చెందిన మిగతా నిందితులు హైదరాబాద్ కు వచ్చారు. బిజినెస్ కోసం వచ్చాని చెప్పి అద్దెకు రూమ్ తీసుకున్నారు. ఆ తర్వాత గూగుల్ సాయంతో పలెల్లోని బ్యాంకుల గురించి ఆరా తీశారు. చివరకు రాయపర్తి బ్యాంకును ఎంచుకున్నారు” అని చెప్పారు.
సుమారు రూ. 14 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
హైదరాబాద్ నుంచి నేరుగా రాయపర్తికి వెళ్లి దొంగతనం చేశారని ఝా తెలిపారు. “నవంబర్ అర్థరాత్రి నిందితులు ఓ కిరాయి కారులో రాయపర్తికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో బ్యాంకు దగ్గరికి చేరుకున్నారు. బ్యాంక్ కిటికీ గ్రిల్స్ తొలగించారు. అనంతరం సెక్యూరిటీ అలారం, సీసీ కెమెరాలు పని చేయకుండా కేబుల్స్ కట్ చేశారు. ఇద్దరు నిందితులు కిటికీ దగ్గర కాపలా ఉండగా, మిగతా వాళ్లు లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. అందులోని లాకర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేశారు. రూ.13. 61 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో బయటకు వచ్చారు. అనంతరం నిందితులు వచ్చిన కారులోనే తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. రెంట్ కు తీసుకున్న రూమ్ లోనే ఏడుగురు బంగారు ఆభరణాలను సమానంగా పంచుకున్నారు. నవంబర్ 19న మూడు టీంలుగా ఏర్పడి మహారాష్ట్ర, యూపీకి వెళ్లిపోయారు” అని సీపీ ఝా చెప్పారు.
కేసును ఎలా ఛేదించారంటే?
టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నట్లు సీపీ ఝా తెలిపారు. “ఈ చోరీ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను కనిపెట్టారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. అరెస్టు చేసి వారి నుంచి కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. త్వరలో మిగతా నలుగురిని పట్టుకుంటాం. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నాను” అని సీపీ ఝా తెలిపారు.
Read Also: రైల్లో సీటు కోసం మర్డర్.. మరీ ఇంత దారుణమా!