బ్యాంకు మోసాల్లో ఇది అతి పెద్ద భారీ మోసం. ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని 23 ఏళ్ల కుర్రాడు చేసిన అతి పెద్ద భారీ స్కామ్ ఇది. దీన్ని చూసి పెద్ద పెద్దవాళ్లే షాకవుతున్నారు. కేవలం రూ.500 డిపాజిట్ చేసి, 5 కోట్ల రూపాయలు కొట్టేశాడు. అతడి కథేంటో తెలుసుకుంటే బ్యాంకుల్ని ఇలా కూడా మోసం చేస్తారా అని షాకవుతాం.
ఎవరీ మోసగాడు?
ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ ప్రాంతానికి చెందిన ఆకాష్ స్థానికంగా కచోరీ షాప్ నడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత 23 ఏళ్ల వయసులోనే ఆ షాపు నడిపే భారం అతడిపై పడింది. అప్పటి వరకు కచోరి షాప్ యువకుడిగానే చుట్టుపక్కలవాళ్లకి ఆకాష్ తెలుసు. కానీ 5 కోట్ల రూపాయల స్కామ్ బయటపడిన తర్వాత అతడి వ్యవహారం చూసి అందరూ షాకయ్యారు.
ఆకాష్ ఏం చేశాడు?
స్థానిక HDFC బ్యాంక్ లో ఈ ఏడాది మే నెలలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ.500 డిపాజిట్ చేశాడు ఆకాష్. ఆ తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉపయోగించుకుని రూ.5000 విత్ డ్రా చేశాడు. ఆ తర్వాత డిపాజిట్లు పెంచుతూ, తన ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ని కూడా పెంచుకున్నాడు. ఇక ఆ తర్వాత ఒకేసారి రూ.50లక్షలు విత్ డ్రా చేశాడు. అలా మొత్తం రూ.5 కోట్లు బ్యాంక్ నుంచి తీసుకున్నాడు. ఈ వ్యవహారం బ్యాంక్ అంతర్గత ఆడిట్ లో బయటపడింది. వారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆకాష్ ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ డబ్బుతో ఏం చేశాడు..?
5 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి తెలివిగా కొట్టేసిన ఆకాష్ ఆ డబ్బుతో జల్సాలు మొదలు పెట్టాడు. అంతే కాదు, షేర్ మార్కెట్ లో కూడా పెట్టుబడులు పెట్టాడు. రెండున్నర లక్షల రూపాయలతో యమహా R15 బైక్ కొన్నాడు. థార్ కారుకి అడ్వాన్స్ కట్టాడు. మూడున్నర లక్షల రూపాయలతో బంగారు నగలు చేయించుకున్నాడు. మూడున్నర కోట్ల రూపాయలను షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఇవన్నీ చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారంతా షాకయ్యారు.
ఇలా ఎలా?
ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం చాలామందికి ఉంటుంది. కానీ వారెవరూ ఇలా కోట్ల రూపాయలు విత్ డ్రా చేయలేదు కదా, ఇందులో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మొత్తమ్మీద ఓవర్ డ్రాఫ్ట్ అనే సౌకర్యంతో రూ.5కోట్లు కొట్టేసి అందరికీ షాకిచ్చాడు ఆకాష్. బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంతో తలపట్టుకున్నారు. ఇటీవల బ్యాంకుల్లో జరిగే స్కామ్ లపై లక్కీ భాస్కర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా ఈ తరహా మోసాలు ఉంటాయి. అయితే అక్కడ బ్యాంకు ఉద్యోగి తను పనిచేసే బ్యాంక్ ని తెలివిగా మోసం చేస్తాడు. ఇక్కడ కస్టమరే బ్యాంకుని మోసం చేయడం, అది కూడా బ్యాంక్ కల్పించిన సౌకర్యాన్ని ఉపయోగించుకుని తెలివిగా బురిడీ కొట్టించడం విశేషం.