Abhishek Bachchan: నెపోటిజం ద్వారా ఎంతోమంది నటీనటుటు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కానీ అలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వారి నుండి ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉంటాయి. స్టార్ హీరోల వారసులు కూడా తమలాగే యాక్టింగ్ చేయాలని, తమలాగే డ్యాన్సులు చేయాలని, ప్రతీ విషయంలో తమ తండ్రిని గుర్తుచేయాలని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. అలాంటి భారీ అంచనాలను అందుకోలేక బాలీవుడ్‌లో వెనుదిరిగిన నెపో కిడ్స్ ఎంతోమంది ఉన్నారు. అలాగే బాలీవుడ్‌లో బిగ్ బీగా పేరు దక్కించుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడు అభిషేక్ బచ్చన్ కూడా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోగా అవన్నీ తట్టుకోలేక ఇండస్ట్రీ నుండి వెళ్లిపోదామనుకున్నానని తాజాగా బయటపెట్టాడు.
నటుడిగా సలహా
తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్. అందులో తన కెరీర్ మొదట్లో తనకోసం తను సెట్ చేసుకున్న అంచనాలను తానే అందుకోలేకపోయానని, అందుకే సినిమాలు వదిలేసి వెళ్లిపోదామని అనుకున్నట్టుగా బయటపెట్టాడు. ‘‘నాకు బాగా గుర్తుంది. ఒక రాత్రి నా తండ్రి దగ్గరకు వెళ్లి నేను ఎంత ట్రై చేసినా వర్కవుట్ అవ్వడం లేదు అనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి తప్పు చేశానని చెప్పేశాను. ఈ ప్రపంచమంతా కలిసి ఇది నీకోసం కాదు అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. నా తండ్రి చాలా మంచి యాక్టర్. అప్పుడే కాసేపు ఆయన తండ్రి అనే విషయం పక్కన పెట్టి ఒక యాక్టర్‌గా నాకొక సలహా ఇచ్చారు’’ అని గుర్తుచేసుకున్నాడు అభిషేక్ బచ్చన్.
ఫైట్ చేయాలి
‘‘ఇది నేను నీకు తండ్రిగా చెప్పడం లేదు ఒక యాక్టర్‌గా చెప్తున్నాను. నువ్వు ఇంకా చాలా దూరం వెళ్లాలి. నువ్వు నీ గమ్యానికి కనీసం దగ్గర్లోకి కూడా రాలేదు. ప్రతీ సినిమాతో నువ్వు ఇంప్రూవ్ అవుతూనే ఉన్నావు. కష్టపడుతూ ఉండూ కచ్చితంగా నీకు నచ్చిన చోటికి చేరుకుంటావు. అలా నేను రూమ్ నుండి బయటికి వచ్చేస్తుండగా నేను నిన్ను వెనుదిరిగే వాడిలాగా పెంచలేదు. కాబట్టి ఫైట్ చేస్తూనే ఉండు అన్నారు. అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. సమయం గడుస్తున్నా కొద్దీ అనుభవాలు మనకు చాలా నేర్పిస్తాయి. ఒకరకంగా అందరం ఓడిపోయే యుద్ధం కోసమే పోరాడుతున్నాం. ప్రతీరోజూ ఈ యుద్ధం నుండి బ్రతికి బయటికి రావడం కష్టమే’’ అని చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్.
Also Read: ఎవరీ గౌరీ స్ప్రాట్.? అమీర్ ఖాన్ డేటింగ్ చేస్తున్న ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా.?
ఓడిపోక తప్పదు
‘‘ప్రతీసారి మనం ఓడిపోయినప్పుడు కాస్త బెటర్‌గా ఓడిపోవాలి అంతే. ఫెయిల్యూర్ అనేది సక్సెస్‌కు ఒక ముందడుగు లాంటిదే. ఓటమి లేకుండా గెలుపు ఉండదు. అలాగే నేను జీవితాన్ని చూశాను’’ అని తెలిపాడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). అభిషేక్ బచ్చన్ మంచి నటుడే అయినా చాలామంది ప్రేక్షకులు తన తండ్రితో తనను పోలుస్తారు కాబట్టి ఆ అంచనాలను తను ఎప్పుడూ అందుకోలేకపోయాడు అని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఎన్ని సినిమాల్లో నటించినా అభిషేక్‌కు సరైన హిట్ పడలేదు. 2004లో విడుదలయిన ‘ధూమ్’ తర్వాత తన కెరీర్ కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత వరుస హిట్లు పడ్డాయి.