Mollywood:సాధారణంగా ప్రతి ఒక్క భాషా ఇండస్ట్రీ ప్రేక్షకుడు విపరీతంగా మెచ్చే సినిమాలలో మలయాళం సినిమాలు మొదటి స్థానంలో ఉంటాయి. చిన్న సినిమాగా వచ్చినా..మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మలయాళ సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి మలయాళం ఇండస్ట్రీకి గత ఏడాది వచ్చిన నష్టం చూస్తే మాత్రం నిజంగా నోరెళ్లబెట్టాల్సిందే. ఎప్పుడు కూడా మంచి మంచి కంటెంట్లతో ప్రేక్షకులను అలరించే ఈ ఇండస్ట్రీకి కూడా నష్టాలు వచ్చాయా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి గత ఏడాది మొత్తంగా మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి సినిమాల కోసం పెట్టిన బడ్జెట్ ఎంత? వచ్చిన నష్టం ఎంత?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఒక్క ఏడాదిలోనే రూ.700 కోట్ల నష్టం..
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యుత్తమమైన ఒరిజినల్ కంటెంట్ ను అందించే పరిశ్రమగా మాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది జాతీయ అవార్డులను కొల్లగొట్టడంలో ఎప్పుడు ఈ పరిశ్రమ ముందుంటుంది. దిగ్గజ దర్శకులు ఎందరో ఈ ఇండస్ట్రీని అత్యున్నత శిఖరానికి చేర్చారు. అయితే మాలీవుడ్ ఇప్పటికీ రూ.200 కోట్ల క్లబ్ సినిమాలను అందించలేదు. ఇక రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్ సినిమాలను పరిమిత బడ్జెట్లతో సినిమాలు తీసే ఈ పరిశ్రమ నుంచి మనం ఆశించలేము. అయితే ఇదంతా పక్కన పెడితే.. గత ఏడాది ఏకంగా రూ.700 కోట్ల నష్టాన్ని ఎదుర్కొందని సమాచారం. ముఖ్యంగా ప్రేమలు, కిష్కింద కాండం, మార్కో, ఆడు జీవితం:ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్ వంటి మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో ఆకర్షించాయి. కానీ ఇటీవల కేరళ చలనచిత్ర నిర్మాతల సంఘం (KFPA) నివేదిక ఆశ్చర్యంగా 2024లో రూ.700 కోట్ల నష్టాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
204 చిత్రాలలో 26 మాత్రమే హిట్..
గత ఏడాది విడుదలైన 204 చిత్రాలలో 5 క్లాసిక్ మలయాళం చిత్రాల రీ రిలీజ్ లు మినహా 26 మాత్రమే ఆర్థిక విజయాన్ని అందుకున్నాయట. సూపర్ హిట్ లేదా యావరేజ్ మాత్రమే ఇందులో ఉన్నాయి. 26 చిత్రాలు సమిష్టిగా రూ. 350 కోట్ల నికర లాభాన్ని తెచ్చిపెట్టాయి. కానీ కే.ఎఫ్.పీ.ఏ గణాంకాల ప్రకారం గ్రాస్ కాకుండా నికర లాభాలను పరిగణలోకి తీసుకొని, ఈ లెక్కల వివరాలను అందించినట్లు సమాచారం. ముఖ్యంగా గత ఏడాది ఒక్కటే 170 చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. వీటి కారణంగానే గత సంవత్సరం మొత్తం పరిశ్రమల్లో రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడితే, రూ.700 కోట్లు నష్టం మిగల్చడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా మలయాళ ఇండస్ట్రీలో నష్టాలు తప్ప, లాభాలు కనిపించడం లేదు. కారణం ప్రీ రిలీజ్ వ్యాపారం కూడా జరగడం లేదని, ఓటీటీ ఒప్పందాలు కూడా నీరసించాయని, మలయాళ నిర్మాతలు వాపోతున్నారు. అందుకే ఇప్పుడు అదుపుతప్పుతున్న బడ్జెట్ ల గురించి సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ కారణంగానే బడ్జెట్ కోతలు తప్పవని కూడా అంచనా వేస్తున్నారు. ఇక దీంతో నటీనటులు తమ పారితోషకాలను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా అందరూ మెచ్చే ఇండస్ట్రీకి ఏకంగా 70% నష్టం మిగలడం అంటే నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.