Manish Sisodia JP Nadda | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోదియా సంచలన ఆరోపణలు చేశారు. తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో.. బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆయన అన్నారు. ఒక జాతీయ మీడియా ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ సిసోదియా ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన సిసోదియా.. ఆ తరువాత మద్యం పాలసీ కుంభకోణం ఆరోపణల్లో విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన 17 నెలలపాటు తిహాడ్ జైల్లో గడిపారు. ఆ తరువాత ఆగస్టు 2024లో ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆయన కూడా మద్యం పాలసీలో ఆర్థిక నేరాల ఆరోపణలపై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై జైలు నుంచి విడుదలై ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బిజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోదియా బిజేపీపై ఆరోపణలు చేశారు.
Also Read: యుపిలో కరెంటు లేదు.. ఢిల్లీ అంతా చెత్త.. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ Vs యోగీ
‘‘జైల్లో నేను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి అర్థమైంది. నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నదనీ, కుమారుడు చదువుకుంటున్నాడనీ వాళ్లకు తెలుసు. అప్పుడే బీజేపీ నాకు అల్టిమేటం ఇచ్చింది. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలేయ్ లేదా జైల్లోనే మగ్గిపో’ అని బెదిరించారు. బీజేపీలో చేరితే ఆప్ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని, నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్‌ను అంగీకరించకుంటే, నాకు సుదీర్ఘ జైలు జీవితం తప్పదని హెచ్చరించారు,’’ అని సిసోదియా ఆరోపించారు.
సిసోదియా ఇంతటి ఆగకుండా కమలం పార్టీపై మరింతగా విమర్శించారు. ‘‘ఇది బీజేపీ విధానం. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తారు. వ్యతిరేకంగా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకొని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలు, సంక్షోమం.. ఈ అంశాలు వాళ్లు పట్టించుకోరు. కేవలం అధికారం కోసం మాత్రమే పని చేస్తారు’’ అని సిసోదియా మండిపడ్డారు.
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పురా నియోజకవర్గం నుంచి ఆప్ పార్టీ తరపున మనీష్ సిసోదియా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
మరోవైపు బిజేపీ నేతలు కూడా ఆప్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. బిజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆప్ పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. ‘‘ఆప్ ప్రభుత్వం అవినీతి రికార్డులు సృష్టించింది,’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా విమర్శించారు. పశ్చిమ ఢిల్లీలో జరిగిన సభలో కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కేజ్రీవాల్ అమాయకుడిగా నటిస్తూ అబద్ధాలు చెబుతారు. ఆప్ ప్రభుత్వం మద్యం కుంభకోణం, వక్ఫ్ బోర్డు కుంభకోణాలతో అక్రమాలకు పాల్పడింది,’’ అని ఆరోపించారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఢిల్లీ కరెంట్ కోతలు ఎక్కవని.. యమున నది కలుషితమైందని చెబుతూ.. కేజ్రీవాల్ అందులో మునిగి స్నానం చేయగలరా? అని సవాల్ చేశారు. ఆప్ పార్టీ పరిపాలనలో ఢిల్లీ మురికికుంపగా మారిందని మండిపడ్డారు.