ఆరోపణలతో కుంగిపోయింది!
అవమానాల్ని మౌనంగా భరించింది!
చేయని తప్పుకి జైలుకెళ్లింది!
దాదాపు ఐదేళ్ల పాటు సహనం కోల్పోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడింది. బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. మొత్తానికి రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సుశాంత్ సూసైడ్‌కి, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. సుశాంత్ కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్ట్‌లని.. సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనల్ని సీబీఐ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సుశాంత్ మరణంతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలతో.. రియా చక్రవర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
రియాకు క్షమాపణ చెప్పాలని బాలీవుడ్ డిమాండ్
చేయని తప్పుకు ఆమె 27 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా.. రియా, ఆమె కుటుంబసభ్యులు మౌనంగా భరించారు. కానీ.. సుశాంత్ మరణం తర్వాత వారిపై జరిగిన ప్రచారం, నిరాధార ఆరోపణలతో ఇంతకాలం వారెంతో కుంగిపోయారు. ఇప్పుడు రియాకు క్లీన్ చిట్ రావడంపై.. బాలీవుడ్ యాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసినందుకు.. ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
2020 జూన్ 14న సొంత ఫ్లాట్‌లో సుశాంత్ మరణం
ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు. అతను మరణవార్త బయటకు తెలిశాక.. కొందరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేదాకా.. సుశాంత్ మరణానికి ఆవిడే కారణం అనుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంత జరిగినా.. రియా కుటుంబం మౌనంగానే ఉంది. తమతో.. అమానవీయంగా ప్రవర్తిస్తున్నా.. సహనంతోనే ఉన్నారు. అయితే.. ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు.. ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా?
మీడియా వేధింపులకు క్షోభ అనుభవించిన రియా ఫ్యామిలీ
అనే ప్రశ్న తలెత్తితే.. ఎక్కడా సరైన సమాధానం దొరకట్లేదు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో.. మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయి. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది. కానీ.. దీనితోనే సమాజం వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? అనేదే.. అసలు ప్రశ్న.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై మనీ లాండరింగ్
సుశాంత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత.. రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై, మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలతో.. ఆవిడ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థల విచారణని కూడా ఆమె ఎదుర్కొంది. తన సోదరుడితో పాటు రియా కూడా జైలు శిక్ష అనుభవించింది.
రియాకు ఎలాంటి నేరం ఆపాదించని సీబీఐ
సుదీర్ఘ కాలంలో ఇలాంటి పరిణామాల తర్వాత.. సీబీఐ నుంచి క్లీన్ చిట్ దొరకడం.. రియాకు నిజంగా ఓ విడుదలలా అనిపించొచ్చు. ముంబై స్పెషల్ కోర్టులో సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో.. రియాకు ఎలాంటి నేరం ఆపాదించలేదు. దీంతో.. ఆమెపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి దాదాపుగా తొలగిందనే చెప్పాలి. చట్టపరంగా కొంతవరకు ఆమెకు ఇది ఊరట కలిగించినా.. ఐదేళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడుల వల్ల.. రియా ఎదుర్కొన్న మానసిక వేదనని పూర్తిస్థాయిలో తొలగించదనే చెప్పాలి.
రియాని నేరస్తురాలిగా చిత్రీకరించిన ఓ సెక్షన్ మీడియా
రియా విషయంలో.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీలు.. ఆమెని నేరస్తురాలిగా చిత్రీకరించడం, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం లాంటివి విస్తృతంగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో.. ఆమె కెరీర్ దెబ్బతినడమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్లీన్ చిట్ ద్వారా.. ఆమెకు న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. సమాజంలో ఆమెపట్ల ఏర్పడిన అభిప్రాయాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు.. రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఏమీ లేదు.
మళ్లీ కొత్త జీవితానికి మొదలుపెట్టేందుకు మంచి అవకాశం
ఎందుకంటే.. రియా తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ క్లీన్ చిట్‌తో చట్టపరంగా కొంత విముక్తి దొరికినా.. ఆమె మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు, సమాజంలో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆమె మళ్లీ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ.. రియా అనుభవించిన వేదన, గతం తాలూకు గాయాలు అంత ఈజీగా మానిపోవు.
ఆమెకు జరిగిన నష్టాన్ని.. తీర్చేదెవరు?
ఎంతటివాళ్లనైనా సరే.. ఒక్క నింద.. మొత్తం కిందకు లాగేస్తుంది. వాళ్ల కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసేస్తుంది. ఇందుకు.. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. రియా చక్రవర్తే. సుశాంత్ ఆత్మహత్యతో.. హీరోయిన్ కాస్తా విలన్ అయిపోయింది. అప్పట్నుంచి.. ఇప్పటివరకు ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో అందరికీ తెలుసు. ఈ మీడియా, ఈ సొసైటీ రియాని దోషిగా చూసింది. ఆమెకు జరిగిన నష్టాన్ని.. తీర్చేదెవరు? పూడ్చేదెవరు? రియా విషయంలో అత్యుత్సాహం చూపిన వాళ్లంతా.. ఇప్పుడు బాధ్యత తీసుకుంటారా?
లైప్ మీద నమ్మకం కోల్పోయిన రియా
కెరీర్ పోయింది! తనదైన టైమ్ పోయింది! ఒక్క మాటలో చెప్పాలంటే.. రియాకు తన లైఫ్ మీద నమ్మకమే పోయింది. సుశాంత్ కేసు విషయంలో.. సమాజం ఆమెపై వేసిన ముద్రతో.. బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు కోల్పోయింది. దాంతో.. ఒక్కసారిగా ఆమె కెరీర్‌కు రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పుడు.. సుశాంత్ చావుకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో.. రియా కోల్పోయిన కెరీర్ మళ్లీ వస్తుందా? తనదైన టైమ్.. ఆమెకి మళ్లీ దొరుకుతుందా? ఈ ఐదేళ్లలో ఆమె కోల్పోయిన అవకాశాలెన్నో! కెరీర్ పీక్‌కి చేరుకుంటున్న టైమ్‌లో సుశాంత్ కేసు రియాని కోలుకోలేని దెబ్బకొట్టింది.
డ్రగ్స్ విచారణతో సమాజంలో చీదరింపులు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న తర్వాత.. సమాజం నుంచి చీదరింపులు ఎదుర్కొంది. సుశాంత్‌ని చెడగొట్టింది. అతనిలా అయిపోవడానికి కారణం రియానే అనే ముద్రవేశారు. అయినా.. సైలెంట్‌గానే ఉంది. తనదైన రోజు కోసం ఎదురుచూసింది. మంచి జరుగుతుందని బలంగా నమ్మింది. చివరిదాకా న్యాయపోరాటం చేసింది. కానీ.. ఇన్నేళ్ల పాటు ఆమె ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది! ఎంతటి మానసిక వేదనకు గురై ఉంటుంది! సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్‌తో.. రియాపై ఉన్న ముద్ర ఇప్పుడిప్పుడే తొలగుతోంది.
ఐదేళ్లలో ఒకే సినిమా చేసిన రియా
రియా చక్రవర్తి.. సుశాంత్ కేసులో ఇరుక్కున్నాక ఈ ఐదేళ్ల గ్యాప్‌లో కేవలం ఒక్క సినిమానే చేసింది. కానీ.. అది కూడా పెద్దగా ఆడలేదు. నిజానికి.. ఆమె ఈ కేసులో గనక లేకపోయి ఉంటే.. ఈపాటికి బాలీవుడ్‌లో ఆమె ఎక్కడో ఉండేది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ ఐడెంటిటీ వస్తోంది. అలాంటి టైమ్‌లో ఈ నింద పడటంతో.. రియా కెరీర్ ఎటూ కాకుండా పోయింది. నిజానికి.. రియా సుశాంత్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ.. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదగాలనుకుంది.
రియాని నేరస్తురాలిగా చిత్రీకరించిన సోషల్ మీడియా
ఒక్క కేసుతో కెరియర్ స్మాష్ అయిపోయింది. ఇప్పుడు.. రియాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. ఓ వర్గం మీడియా, సోషల్ మీడియా.. విచారణ, తీర్పు లేకుండానే.. రియాని నేరస్తురాలిగా చిత్రీకరించాయి. ఆమె పర్సనల్ లైఫ్‌ని, కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని అవమానించారు. దాంతో.. మానసికంగా రియా ఎంతో కుంగిపోయింది.
ఎవరు తప్పు చేశారు.. ఎవరి ప్రమేయమేంటి?
ఈరోజుల్లో ఏదైనా ఘటన జరిగితే.. కక్ష తీర్చుకునేందుకు ఈ సమాజానికి ఓ క్యారెక్టర్ కావాలి. ఎవరు తప్పు చేశారు? ఎవరి ప్రమేయమేంటి? ఆ ఘటనతో వాళ్లకున్న సంబంధమేంటి? లాంటివేవీ తేలకముందే.. ఈ సొసైటీనే ఓ ముద్ర వేసేస్తుంది. జడ్జిమెంట్లు పాస్ చేస్తుంది. తప్పందా వాళ్లదేనని ముద్ర వేసి.. తీర్పు కూడా చెప్పేస్తుంది. కానీ.. దర్యాప్తు సంస్థలు, న్యాయ స్థానాలు అసలు విషయం చెప్పాక.. ఒక్కరు కూడా బాధితుల గురించి మాట్లాడరు. అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. రియా చక్రవర్తి పరిస్థితి కూడా ఇదే. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. దానికి అసలు కారణమేంటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అమాయకులపై తప్పుడు ప్రచారాలు చేసే సంస్కృతి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. నిర్దోషులనే.. దోషులుగా చిత్రీకరించి.. సమాజం ముందు నిలబెడుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు
సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. అతని మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది సూసైడ్ కాదని.. సుశాంత్ కుటుంబం.. నటి రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. వారు సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని.. అతని తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. దాంతో.. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని భావించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియాను ప్రశ్నించింది. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ జైలుకు కూడా వెళ్లారు.
ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు లభ్యం కానీ ఆధారాలు
ఈ క్రమంలోనే.. సుశాంత్ కేసు బిహార్ పోలీసుల నుంచి సీబీఐ చేతికి మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు.. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాంతో.. రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీడియాలో, సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేసిన వాళ్లు, అసత్య ఆరోపణలు చేసిన వాళ్లంతా.. ఇప్పుడు రియాకు జరిగిన నష్టానికి బాధ్యులే! సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా.. రియాకు జరిగిన సామాజిక నష్టాన్ని పూర్తిగా పూడ్చడం ఎవరి వల్లా కాదు.