Actor Vijaya Rangaraju : ప్రముఖ సీనియర్ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) అనారోగ్యం కారణంగా తాజాగా కన్నుమూశారు. వారం క్రితం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ టైంలో గాయపడ్డ విజయ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నైకి వెళ్లారు. అందులో భాగంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన, అక్కడే గుండెపోటుతో మరణించారని సమాచారం. రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
విజయ రంగరాజు సినీ ప్రస్థానం
విజయ రంగరాజు (Vijaya Rangaraju)కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక రంగరాజు సినిమా ప్రస్థానం విషయానికి వస్తే… 1994 లో వచ్చిన ‘భైరవ ద్వీపం’ అనే హిట్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు ఆయన. కానీ ‘యజ్ఞం’ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా, రంగరాజు విలన్ గా యాక్ట్ చేసి మెప్పించారు. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలు చేయడం మాత్రమే కాదు ఆయన వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రావీణ్యం ఉన్న అద్భుతమైన నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్న రంగరాజు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సమయానికి అందని సాయం
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం రంగరాజు (Vijaya Rangaraju) చాలాకాలం నుంచి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. రీసెంట్ గా ఆసుపత్రిలో చేరిన ఆయన సరైన కేరింగ్, చికిత్సకు కాలవసిన డబ్బులు లేని కారణంగా మృతి చెందినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రంగరాజు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోసం ఇండస్ట్రీలో పలువురిని సాయం కోరారని సమాచారం. అయినప్పటికీ ఒక్కరు కూడా రంగరాజు ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. కానీ గాయం కారణంగా ఆసుయపత్రిలో చేరిన ఆయన, అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్ళడం మాత్రం బాధాకరం.
ఇండస్ట్రీలో కలిసిరాని కాలం
ఇదిలా ఉండగా, రంగరాజు (Vijaya Rangaraju) మంచి టాలెంట్ ఉన్న నటుడే అయినప్పటికీ ఆయనకు ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ఆయన లుక్స్, హైట్ ను చూసి దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావుతో పోల్చారు మొదట్లో. క్లాసిక్ మూవీ ‘భైరవ ద్వీపం’తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగు పెట్టినప్పటికీ అవకాశాలు పెద్దగా రాలేదు. ‘యజ్ఞం’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించారు. కానీ ఆ సినిమాలన్ని వరుసగా డిజాస్టర్ కావడంతో రంగరాజు కెరీర్ బాగా స్లో అయ్యింది. ఇక ఆ తరువాత ఆయనను అవకాశాలేమీ పలరించకపోవడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు.