Ranya Rao: దుబాయ్ నుండి ఇండియాకు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నిందితులు ఎంతోమంది ఉన్నారు. కానీ తాజాగా ఒక హీరోయిన్ ఈ పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయి షాకిచ్చింది. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 15 కిలోల బంగారాన్ని తరలిస్తూ పోలీసుల చేతికి చిక్కింది కన్నడ నటి రాన్యా రావు. గత 15 రోజుల్లో దాదాపు నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చింది రాన్యా. దీంతో తను ఇంత తరచుగా వెళ్లడానికి కారణమేంటి అని పోలీసుల్లో అనుమానం మొదలయ్యింది. అలా తాజాగా మరోసారి దుబాయ్ నుండి బెంగుళూరుకు తిరిగొచ్చిన రాన్యా రావును ఆపి విచారించగా అసలు విషయం బయటపడింది.
అనుమానం రాకుండా
రాన్యా రావు నటి మాత్రమే కాదు.. డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావుకు కూతురు కూడా. రామచంద్రరావు రెండో భార్య కూతురే రాన్యా. సోమవారం రాత్రి దుబాయ్ నుండి బెంగుళూరుకు వచ్చిన రాన్యా రావును ఎయిర్‌పోర్టులోనే ఆపారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు. గత కొన్నిరోజులుగా రాన్యా రావు దుబాయ్ పర్యటనలను వారు గమనిస్తూనే ఉన్నారు. గతంలో రాన్యా దుబాయ్ నుండి వచ్చేటప్పుడు చాలావరకు బంగారాన్ని ధరించి వచ్చేదని, అందుకే ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దాంతో పాటు బిస్కెట్ల రూపంలో ఉన్న కొంత బంగారాన్ని తన దుస్తుల్లో కూడా దాచేదని బయటపెట్టారు.
చెప్పింది నిజమేనా?
దుబాయ్ నుండి బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే డీజీపీ అయిన తన తండ్రి పేరును ఉపయోగించుకొని చెకింగ్ నుండి తప్పించుకునేదట రాన్యా రావు. అలా బయటికి రాగానే తనను ఎవరో ఒకరు పికప్ చేసుకొని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లిపోయేవారని విచారణలో బయటపడింది. నిజంగానే రాన్యా రావు చేస్తున్న పనుల్లో డీజీపీ రామచంద్ర రావుకు సంబంధం ఉందా? లేదా అనవసరంగా తన తండ్రి పేరును ఉపయోగించుకొని తప్పించుకోవాలని చూస్తుందా? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గత 15 రోజుల్లో మాత్రమే కాకుండా ఇంతకు ముందు కూడా రాన్యా గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిందా అని కూడా తెలుసుకుంటున్నారు.
Also Read: సిరాజ్‌తో డేటింగ్ రూమర్లపై ఫస్ట్ టైమ్ స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ.. నిజం చెప్పేసిందిగా.!
బంగారం స్వాధీనం
రాన్యా రావు (Ranya Rao)ను పట్టుకోవడానికి నలుగురు పోలీస్ ఆఫీసర్లు ఉన్న టీమ్ రంగంలోకి దిగింది. తను దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కిందని తెలియగానే బెంగుళూరులోని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. అలా బెంగుళూరు ఎయిర్‌పోర్టులో తనకోసం నిఘా పెట్టి మరీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. రాన్యా రావును కస్టడీలోకి తీసుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తనను బెంగుళూరులోని డీఆర్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. తనను కోర్టులో హాజరుపరచడానికి డీఆర్ఐ అధికారులు సిద్ధమయ్యారు. రాన్యా రావు కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన ‘మానిక్య’ అనే మూవీలో కూడా రాన్యా రావు హీరోయిన్‌గా కనిపించి అలరించింది.