Varalakshmi Sarathkumar: దాదాపు గత 12 సంవత్సరాల క్రితం విశాల్ (Vishal) హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) , అంజలి (Anjali) హీరోయిన్గా నటించిన చిత్రం మదగజరాజా(MadagajaRaja). ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అయితే 12 ఏళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన తమిళ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్నేళ్ల తర్వాత కూడా విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఒక అభిమానుల ఎదురుచూపుకు తెర దించుతూ.. ఈరోజు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో నటీనటుల పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి సంతానం (Santhanam) తన కామెడీతో మరొకసారి ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. పైగా మనోబాల (Manobala) కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే సుందర్.సి (Sundar C) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన రెండవ చిత్రమే కావడం గమనార్హం.
పెళ్లి తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా పెళ్లి పై స్పందించింది. ముఖ్యంగా పెళ్లి వల్ల తనలో మార్పు రాలేదని, తన భర్త నికోలయ్ లో చాలా మార్పు వచ్చిందని తెలిపింది. ఇకపోతే గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ.. “పెళ్లి తర్వాత నా జీవితంలో ఎటువంటి మార్పులు రాలేదు. కానీ నా భర్త నికోలయ్ లైఫ్ లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయి. ఆయన ప్రత్యేకించి నాకోసం హైదరాబాదు షిఫ్ట్ అయ్యారు. తన పేరు నికోలయ్ సచ్ దేవ్ వరలక్ష్మీ శరత్ కుమార్ గా కూడా మార్చుకున్నారు. కెరియర్ పరంగా నేను ఎన్నో సాధించాలని ఆయన ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్క్ విషయంలో ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూ ఉంటారు” అంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఎప్పుడూ అదే భావనలో ఉండేదాన్ని..
పెళ్లి చేసుకోవడం పై మాట్లాడుతూ..” నేను ఎప్పుడూ కూడా పెళ్లి గురించి ఆలోచించలేదు. అసలు చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనే భావనలో మాత్రమే నేను ఉండేదాన్ని. అందుకే ఎప్పుడూ కూడా పెళ్లి అనే ఆలోచనలు చేయలేదు. కానీ కాలం మారే కొద్ది నికోలయ్ తో నాకు పరిచయం ఏర్పడింది. అతడే నా జీవితానికి సరైన భాగస్వామి అని అర్థమై పెద్దలను ఒప్పించి, వివాహ బంధంలోకి అడుగు పెట్టాము” అంటూ తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. మొత్తానికి అయితే పెళ్లి గురించి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.