Khalid Rahman: ప్రస్తుతం బయట ప్రపంచంలోనే కాదు.. సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్ వాడకం అనేది విచ్చలవిడిగా చలామణీ అవుతోందని తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నా కూడా ఎవరూ దీనిని అరికట్టలేకపోతున్నారు. సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఉపయోగించడం వల్ల పలువురు యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు పోలీసులకు దొరికిపోయినా కూడా ఇప్పటికీ అలాంటి కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ సైతం డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు. ఇటీవల తన సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. మరొక దర్శకుడితో కలిసి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు.
వెంటనే బెయిల్
గత కొన్నాళ్లలో మలయాళం సినిమాలకు దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. మలయాళ భాషలో ఏ సినిమా విడుదలయినా కూడా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా దానిని నేరుగా థియేటర్లలో చూడడానికే ఇష్టపడుతున్నారు. అలా పలువురు యంగ్ డైరెక్టర్లు మంచి మలయాళ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలాంటి వారిలో ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా కూడా ఒకరు. అయితే వీరిద్దరూ మరొక వ్యక్తితో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా వారికి కొన్ని గంటల్లోనే బెయిల్ దొరికిందని సమాచారం.
కస్టడీలో ముగ్గురు
ఖలీద్ రెహమాన్ (Khalid Rahman), అష్రఫ్ హంజా (Ashraf Hamza) వద్ద 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొచ్చీలోని గోస్రే బ్రిడ్జ్ వద్ద ఉన్న ఒక ఫ్లాట్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం అందింది. దీంతో వారు ఆదివారం తెల్లవారుజామున అక్కడ రెయిడ్‌కు వెళ్లారు. అందులో ఈ ఇద్దరు దర్శకులతో పాటు సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహీర్, షలీఫ్ మొహమ్మద్‌ను కూడా అరెస్ట్ చేశారు. ‘‘మేము ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. వారిపై తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం’’ అని ఎర్నాకులంకు చెందిన ఎక్సైజ్ అధికారి మీడియాకు తెలిపారు.
Also Read: బ్రాహ్మణుడే.. కానీ, నరమాంసం అయినా తినేస్తాడు.. ఆ సీనియర్ నటుడు మరీ అలాంటోడా.?
వరుస హిట్లు
ఫ్లాట్‌లో ఉంటున్న వ్యక్తులు తరచుగా డ్రగ్స్ ఉపయోగిస్తారని బయటపడిందని, ఆ దర్శకులు మాత్రం అక్కడికి స్టోరీ డిస్కషన్ కోసం వచ్చారని పోలీసులు చెప్తున్నారు. ఖలీద్ రెహమాన్ తాజాగా ‘అలప్పురా జింఖానా’ (Alappuzha Gymkhana) అనే సినిమాను డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ‘జింఖానా’ రిలీజ్ అయ్యింది. దానికంటే ముందు ఖలీద్ తెరకెక్కించిన ‘తల్లుమాలా’ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక అష్రఫ్ హంజా సైతం ఖలీద్ డైరెక్ట్ చేసిన ‘తల్లుమాలా’కు రైటర్‌గా పనిచేశాడు. మంచి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న ఈ దర్శకులు.. ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడడం బాలేదంటూ మలయాళ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.