Allu Aravind: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది అనే విషయం తెలిసింది. రేవతి మృతి యాక్సిడెంటే అయినా ఆ కేసు అల్లు అర్జున్‌కు ఉచ్చులాగా బిగుసుకుంది. ఈ విషయంపై క్లియర్‌గా స్పందించడం కోసం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా పోలీసులపైనే నిందలు వేస్తున్నట్టుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు కూడా అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ తనకు మరింత సమస్యలు తెచ్చిపెట్టింది. తాజాగా పలువురు విద్యార్థి నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయగా దానిపై అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అర్జున్ మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు.
కేసు నమోదు
అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాలు దాడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేవతికి, కుటుంబానికి న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. ఆ దాడిని అల్లు అర్జున్ సిబ్బంది అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో అసలు అల్లు ఫ్యామిలీ ఎవరూ బయటికి రాలేదు. అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం తన పిల్లలు అయాన్, అర్హను తన బంధువుల ఇంటికి పంపించేశాడు. విద్యార్థి సంఘాలు రాళ్ల దాడి ఆపేసిన తర్వాత అల్లు అరవింద్ ఈ విషయంపై స్పందించడానికి బయటికొచ్చారు. ‘‘మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. వారు కేసు నమోదు చేశారు’’ అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.
Also Read: అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పాడా.? థియేటర్‌లో ఏం జరిగింది.? వీడియోలు ఇవే..
పోలీసులు చూసుకుంటారు
ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారంటూ దాడికి రావాలని ఆలోచన ఉన్నవారికి వార్నింగ్ ఇచ్చారు అల్లు అరవింద్ (Allu Aravind). ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సమయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అన్నారు అల్లు అరవింద్. మొత్తానికి అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉంది. ఈ దాడిపై అల్లు అర్జున్ ఆర్మీ చాలా సీరియస్‌గా ఉంది. సోషల్ మీడియాలో తనకు సపోర్ట్ పెరిగిపోయింది.
ఎవరిది తప్పు
చాలామంది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అని అంటున్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం గుడ్డిగా తమ హీరో ఏది చెప్తే అది నమ్ముతూ తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక ప్రాణం పోయినా కూడా ఆ ప్రాణానికి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా ఇదంతా రాజకీయ కుట్ర అని, కావాలనే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. అలా అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా కొందరు, వ్యతిరేకంగా కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా కాస్త సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుందని ఫీలవుతున్నారు.