Allu Aravind : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ ఈవెంట్లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీ తేజని తాజాగా అల్లు అరవింద్ పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ (Allu Aravind) శ్రీ తేజ (Sritej) కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఇదంతా చూసిన నెటిజన్లు డ్యామేజ్ కంట్రోల్ కి అల్లు వారి పాట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న ‘పుష్ప 2’ మూవీ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ కన్ను మూయగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ అబ్బాయిని కిమ్స్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అయిన అల్లు అరవింద్ (Allu Aravind) శ్రీ తేజ్ ను పరామర్శించడానికి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లను అడిగి, బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ తేజ ఫ్యామిలీ మెంబర్స్ తో అల్లు అరవింద్ మాట్లాడి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే చనిపోయిన ఆ మహిళ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న కారణంగా అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి రాలేకపోయారని వివరించారు. బన్ని తరుపున తాను ఆసుపత్రికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పటిదాకా శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు వారు పరమర్శించలేదనే విమర్శలు, అల్లు అర్జున్ పై రోజురోజుకీ ఈ కేసులో నెగెటివిటీ పెరుగుతుండడంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్ళాడు అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
మరోవైపు ఈ కేసులో తగ్గేదే లే అంటున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసులు సీజ్ చేస్తామని సంధ్య థియేటర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇచ్చిన హామీ ప్రకారం బాధిత కుటుంబానికి 25 లక్షలు కాకుండా కేవలం 10 లక్షలు ఇచ్చారని అంటున్నారు. ఇక డిసెంబర్ 4 నుంచి ఇప్పటిదాకా శ్రీ తేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోందని అంటున్నారు.
తాజాగా అల్లు అర్జున్ కేసు విషయంపై ప్రభుత్వంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. కొంతమంది అల్లు అర్జున్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. మరి నెక్స్ట్ ఈ కేసులో అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.