Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తన కుమారుడు అయిన శ్రీ తేజ్ ప్రస్తుతం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్నాళ్ల తర్వాత శ్రీ తేజ్‌ను కలవడానికి ముందుకొచ్చాడు అల్లు అర్జున్. ఉదయం 10 గంటలకు శ్రీ తేజ్‌ను కలవడానికి కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నాడు ఈ హీరో. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై బయట ఉండడంతో శ్రీ తేజ్‌ను కలిసే సమయంలో పలు షరతులు వర్తిస్తాయని పోలీసులు ముందే వివరించారు.
ఎంతోమంది వచ్చారు
ఒకవేళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తమకు ముందే సమాచారం అందించమని రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకే వారి అనుమతి తీసుకొని ఉదయం 10 గంటలకు శ్రీ తేజ్‌ను కలవడానికి బయల్దేరనున్నాడు బన్నీ. శ్రీ తేజ్‌ను కలిసిన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీ తేజ్‌ను కలవడానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు.. అందులోనూ ముఖ్యంగా ‘పుష్ప 2’ మూవీ టీమ్ ముందుకొచ్చింది. అల్లు అరవింద్ కూడా స్వయంగా రెండుసార్లు వచ్చి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కొని వెళ్లారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసుపత్రికి రాకపోవడంపై విమర్శలు వినిపించాయి.
Also Read: అకీరా ఎంట్రీ డెబ్యూ ఖుషీ 2 తోనే… పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇక పండగే..
బలమైన కేసు
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో చాలావరకు తప్పు అల్లు అర్జున్‌దే అంటూ తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను వస్తున్నట్టుగా, రోడ్ షో చేస్తున్నట్టుగా తమకు తెలియదని పోలీసుల వాదన. అంతే కాకుండా తాను థియేటర్‌లో ఉన్నప్పుడు బయట రేవతి మరణించిన విషయం కూడా తాము స్వయంగా అల్లు అర్జున్‌కే చెప్పామని పోలీసులు చెప్తున్నారు. అలా అల్లు అర్జున్ తప్పించుకోలేని కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఆయన బయట ఉన్నా కూడా అది బెయిల్‌పైనే కాబట్టి దానికి అనుగుణంగా బన్నీ ప్రవర్తించాల్సి ఉంటుంది.
కోలుకోని శ్రీ తేజ్
తనపై కేసు నమోదవ్వడం వల్లే తాను ఇప్పటివరకు శ్రీ తేజ్‌ను కలవడానికి ఆసుపత్రికి రాలేదని అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్ కూడా వివరించారు. కానీ శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి కనుక్కోవడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని, తన వల్ల జరిగిన తప్పును తను అస్సలు పట్టించుకోవడం లేదంటూ అల్లు అర్జున్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అసలు ఇందులో హీరో తప్పేమీ లేదంటూ సమర్థిస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు. ఇది ఎవరి తప్పు అయినా కూడా శ్రీ తేజ్ మాత్రం ఇంకా కోలుకోలేదంటూ ప్రేక్షకులు వాపోతున్నారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఎప్పటికప్పుడు బులిటెన్ కూడా విడుదల చేస్తున్నారు.