Amaran: ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే చాలు.. అది ఏ భాష, అందులో నటీనటులు ఎవరు, దానిని స్టార్ డైరెక్టర్ తెరకెక్కించాడా లేదా లాంటివి పట్టించుకోరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అయితే వీటితో అస్సలు సంబంధమే లేదు. కంటెంట్ బాగుంటే చాలు.. తెలుగులో ఆ మూవీని హిట్ చేయడానికి ప్రేక్షకులంతా ఒక్కటవుతారు. అలా ఇటీవల విడుదలయిన సినిమాల్లో ఒక రేంజ్‌లో హిట్ అందుకున్న చిత్రం ‘అమరన్’ (Amaran). ఇప్పటికీ ఈ సినిమా ఎన్నో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతలోనే ఈ మూవీకి లీగల్ కష్టాలు మొదలయ్యాయి. అది కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ వల్ల ఇంత పెద్ద సినిమాకు లీగల్ కష్టాలు ఎదురవ్వడం అనేది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫోన్ నెంబర్ కష్టాలు
సినిమాలు తెరకెక్కించే సమయంలో ఎన్నో విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా దాని వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ‘అమరన్’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలో సాయి పల్లవి నెంబర్ ఇదే అంటూ ఒక నెంబర్‌ను చూపించారు మేకర్స్. దీంతో ఆ నెంబర్‌ను నోట్ చేసుకున్న చాలామంది సాయి పల్లవి ఫ్యాన్స్.. దానికి కాల్స్, మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టారు. ఆ కాల్స్ అన్నీ చెన్నైలో ఉన్న కాలేజ్ స్టూడెంట్‌కు కనెక్ట్ అవుతున్నాయి. ‘అమరన్’లో సాయి పల్లవి ఫోన్ నెంబర్ అంటూ చూపించిన నెంబర్.. తనదే అంటూ ఆ స్టూడెంట్ వాపోతున్నాడు.
Also Read: దుమారం రేపుతున్న సమంత పోస్ట్.. ఏం జరిగిందంటే..?
లీగల్ పిటీషన్
చెన్నైకు చెందిన కాలేజ్ స్టూడెంట్ అయిన వగీసన్‌కు సాయి పల్లవి ఫ్యాన్స్ నుండి వస్తున్న కాల్స్, మెసేజ్‌లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే విషయాన్ని తాను ‘అమరన్’ మేకర్స్‌కు తెలిసేలా చేశానని, తన నెంబర్ సినిమాలో నుండి తీసేయమని రిక్వెస్ట్ చేశానని చెప్తున్నాడు. కానీ మూవీ టీమ్ నుండి తనకు ఎలాంటి సపోర్ట్ దక్కకపోవడంతో తాను లీగల్‌గా ముందుకెళ్లాడు. ‘అమరన్’ మేకర్స్‌పై ఒక పిటీషన్ దాఖలు చేశాడు. ఆ పిటీషన్‌లో తనకు నష్టపరిహారంగా రూ.1.1 కోట్లు కావాలని పేర్కొన్నాడు. ఇక వగీసన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ‘అమరన్’ టీమ్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. అయితే సినిమాల్లో చూపించే నెంబర్ల వల్ల ప్రేక్షకులకు ఇబ్బందులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు.
శివకార్తికేయన్ రికార్డ్
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇప్పటివరకు తమిళంలో ఏ యంగ్ హీరో కూడా తన సినిమాలతో ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించలేకపోయాడు. దీంతో ఈ మూవీతో శివకార్తికేయన్ (Sivakarthikeyan) రేంజ్ పెరిగిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ‘అమరన్’ మూవీ ఈ రేంజ్‌లో హిట్ అవ్వడానికి సాయి పల్లవి (Sai Pallavi) కూడా ముఖ్య కారణమని తన ఫ్యాన్స్ అంటున్నారు. ఇందు రెబెక్కా వర్గీస్ అనే పాత్రలో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించడంలో కూడా సక్సెస్ అయ్యింది సాయి పల్లవి.