Ram Gopal Varma:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా.. కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma). అయితే తాజాగా రాంగోపాల్ వర్మ కు షాక్ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై నోటీసులు జారీ చేసింది. అంతేకాదు పొందిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని గడువు కూడా విధించింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ముందు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), లోకేష్ (Lokesh)తో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం జరిగింది. ఇప్పటికే దీనిపై పలుచోట్ల ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఇదే విషయంలో వర్మకి నోటీసులు పంపిస్తూ షాక్ ఇచ్చింది ‘ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్’.
రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు.
‘వ్యూహం’ సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా.. గత వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని సీరియస్ గా పరిగణించిన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్.. ఈ సినిమాకి తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచితంగా లబ్ధి పొందడంపై వర్మతో పాటు నాటి ఫైబర్ నెట్ ఎండి సహా ఐదుగురికి లీగల్ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు 15 రోజుల్లోగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని నోటీసులలో పేర్కొంది. గడువులోపు చెల్లించకపోతే.. వర్మపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా తెలిపింది. మరి దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
వర్మపై ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఫైర్..
ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి(GV.Reddy)మాట్లాడుతూ.. సహజంగా అవగాహన ఒప్పందాలు చేసుకునే సమయంలో ఎవరు ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. దాని నియమ నిబంధనలు ఏంటి? అనే విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. కానీ ఇవేవీ కూడా గత ఫైబర్ నెట్ కార్పొరేషన్ పాటించలేదు అంటూ ఆరోపణ చేశారు. ముఖ్యంగా ‘వ్యూహం’ చిత్ర బృందంతో కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందంలో అస్సైనీల పేర్లు ఎక్కడ ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఆర్జీవి మేకర్స్ కు చెందిన రబ్బర్ స్టాంప్ , నిర్మాతల పేర్లు కూడా పొందుపరచలేదు. అసలు ఏజీఎం సంతకం ఉన్నప్పటికీ ఆ సైన్ కింద ఆయన తన పేరును రాయలేదు. కాబట్టి ఇలాంటి ఒప్పందాలు చెల్లవు అంటూ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. సాధారణంగా వ్యూహం ఫస్ట్ పార్టీకి 1845 వ్యూస్, రెండవ పార్ట్ కి 383 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ రెండు పార్ట్ లకు రెండు లక్షల వ్యూస్ వచ్చినట్లుగా చూపించారు. ఒక్కో వ్యూకి రూ.100కు బదులు రూ.11,000చొప్పున రూ.1,14,96,610 తీసుకున్నారు దీనంతటిని వడ్డీతో సహా వర్మ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఇకపోతే వర్మకు నోటీసులు ఇవ్వడంతో వైసిపి మండిపడుతోంది. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతూ వర్మపై కక్ష్య సాధింపు చర్యగా నోటీసులు జారీ చేశారు అంటూ ఫైర్ అయ్యింది. మరి వర్మ ఏం చేస్తారు? అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.