AS Ravi Kumar Chaudhary : ప్రముఖ డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (AS Ravi Kumar Chaudhary) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. తనకంటూ ఒక పేరు దక్కించుకున్న ఈయన.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో పాటు యువ హీరోలు నితిన్ (Nithin ), రాజ్ తరుణ్ (Raj Tarun) , సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) వంటి హీరోలతో సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన జూన్ 10వ తేదీ రాత్రి గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు సమాచారం.
సొంత కుటుంబానికి దూరమైన ఏఎస్ రవికుమార్ చౌదరి..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈయన తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారని, అటు ఇండస్ట్రీలో సన్నిహితులు కూడా దూరం కావడం ఆయన మీద ప్రభావం చూపించిందని, అందుకే అటు కుటుంబాన్ని కూడా దూరమైనట్లు సమాచారం. ఇకపోతే ఆయన ఇలా గుండెపోటుతో మరణించడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? అనే విషయాలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రవికుమార్ చౌదరి సినిమాలు..
అసలు విషయంలోకి వెళ్తే.. గోపీచంద్ (Gopichandh) హీరోగా “ఈ తరం ఫిలిమ్స్” పతాకం పై పోకూరి బాబురావు నిర్మించిన ‘యజ్ఞం’ సినిమాతో రవికుమార్ చౌదరి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా చేశారు. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా ‘ఆటాడిస్తా’ సినిమాను భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదల చేశారు కానీ ఈ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక దీంతో రవి కుమార్ కెరియర్ అయిపోయింది అనుకున్న సమయంలోనే మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా, రెజీనా కాసాండ్రా (Regina Cassandra) హీరోయిన్ గా ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సినిమా చేసి మళ్లీ గట్టి కమ్ బ్యాక్ అయ్యారు రవికుమార్ చౌదరి. ఈ సినిమా ఆయనను మళ్ళీ దర్శకుడిగా నిలబెట్టింది.
ఈ సినిమా సక్సెస్ తో తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపీచంద్ తో మరొకసారి ‘సౌఖ్యం’ సినిమా చేశారు. కానీ ఇది విజయం సాధించలేదు. ఇక తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘తిరగబడరా సామి’ కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో వరుస సినిమాలు డిజాస్టర్ గా మారడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన రవికుమార్.. మద్యానికి బానిసై ఇండస్ట్రీకి దూరమైనట్లు గతంలో వార్తలు వినిపించాయి.
సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా గుర్తింపు..
ఇకపోతే ఈయన ‘తిరగబడరా సామి’ ప్రారంభోత్సవంలో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) ను ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది .దాంతో ఆయన ప్రవర్తన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అటు సినిమాలతో ఇటు కాంట్రవర్సీ విషయాలతో భారీ పాపులారిటీ అందుకున్న రవికుమార్ చౌదరి ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.
ALSO READ:Actress : మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఎవరంటే?