Saif Ali khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన ఘటన తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆటోలో లీలావతి హాస్పిటల్ కు చేర్చిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా.. శుక్రవారం ముంబైలో విలేకరులకు ఆరోజు జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడిన కొందరు దుండగులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ను వెంటనే హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ సైఫ్ ను హాస్పిటల్ వరకు చేర్చారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆటో డ్రైవర్ బదన్ సింగ్ రాణా.. గురువారం తెల్లవారుజామున సైఫ్ నివాసం ఉండే సత్ గురు దర్శన్ భవన్ మీదుగా వెళుతున్నప్పుడు ఓ మహిళతో పాటు మరికొందరు ఆటోను ఆపాల్సిందిగా తనను కోరారని తెలిపారు. వెంటనే ఆటో ఆపానని.. రక్తంతో తడిసిన తెల్లని కుర్తాతో ఓ వ్యక్తి ఆటో ఎక్కారని… ఆయన నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కగలిగారని.. ఎలాంటి మార్పు కానీ, భయం కానీ ఆయనలో కనిపించలేదని తెలిపారు.
అయితే ఆయనకు మెడ, వీపుపై గాయాలు అయినట్టు చూశాను కానీ చేతికైనా గాయాన్ని గమనించలేదని.. ఎనిమిదేళ్ల కుర్రాడు ఒకరు ఆయనతో పాటు ఆ ఆటో ఎక్కారు. ఇక మరో అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ అనుకుంటా.. ఆయన కూడా ఆటో ఎక్కారు. మొదట బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలనుకున్నాము కానీ లీలావతి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సైఫ్ చెప్పడంతో అదే హాస్పిటల్ కి 7 నుంచి 8 నిమిషాల్లో చేరుకున్నాం. అక్కడ గార్డ్ ను ఉద్దేశించి తాను సైఫ్ అలీ ఖాన్ అని.. దయచేసి స్ట్రచర్ తీసుకురావాలని చెప్పారు. ఆ సమయంలోనే నాకు ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే విషయం తెలిసింది. ఆటోకి కిరాయి కూడా నేను తీసుకోలేదు అంటూ రాణా వివరించారు.
ALSO READ : ఫైనల్‌గా నితిన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాబిన్‌హుడ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇక ఈ కేసుకు సంబంధించి సైఫ్ పై జరిగిన దాడిలో చోరీ ఉద్దేశమే కనిపిస్తోందని మహారాష్ట్ర హోమ్ శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు. దీనిలో క్రిమినల్ ప్రమేయం కనిపించడం లేదని.. దాడి చేసినట్టు భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానిత యువకుడికి ఈ ఘటనతో సంబంధం లేదని గుర్తించామని తెలిపారు. ఏదైనా బెదిరింపు వచ్చినట్టు కూడా సైఫ్ అలీ ఖాన్ తెలపలేదని.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందుకోలేదని చెప్పుకొచ్చారు. సెక్యూరిటీ కూడా సైఫ్ కోరలేదని.. ఒకవేళ అలా కోరితే తప్పకుండా అందిస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ దాడి వెనుక అండర్ వరల్డ్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానం సైతం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే ఇంట్లో పని చేసే వారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారికి సంబంధించిన ఫోన్స్ తో పాటు అందులో ముఖ్యంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్లకు వచ్చిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.