Balagam Venu: సినీ పరిశ్రమలో జానపద కళాకారులు చాలామంది ఉన్నా కూడా అందులో కొందరికి మాత్రమే ప్రేక్షకుల్లో గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారిలో ‘బలగం’ మొగిలయ్య కూడా ఒకరు. వేణు యెల్ధండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్‌లో ఒక జానపద గీతం పాడి అందరినీ కంటపడి పెట్టించారు మొగిలయ్య. అలాంటి మొగిలయ్య తాజాగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో కన్నుమూశారు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు తనకు సంతాపం తెలియజేశారు. అందులోనూ ముఖ్యంగా ఆయనను వెండితెరకు పరిచయం చేసిన వేణు యెల్ధండి సైతం మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేస్తూ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు.
నా అదృష్టం
‘మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బలగం సినిమా క్లైమాక్స్‌లో అయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు వేణు. మొగిలయ్యకు జానపద కళాకారుడిగా ఎంత గుర్తింపు ఉన్నా ఆయనను వెండితెర ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం వేణునే. ‘బలగం’ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ మాత్రం ఒక ఎత్తు. దాదాపు పావుగంట పాటు ఎమోషన్‌ను పండిస్తూ ప్రేక్షకులను తన పాటతో ఎమోషనల్ అయ్యేలా చేశారు మొగిలయ్య.
Also Read: టాలీవుడ్‌లో విషాదం.. జానపద గాయకుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరు
ఎన్నోసార్లు తోడుగా
మొగిలయ్యకు చాలాకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఉంది. అందుకే తన సినిమాలో నటించిన తర్వాత బలగం వేణు సైతం మొగిలయ్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాడు. తను మాత్రమే కాదు.. ఈ సినిమాకు సంబంధించిన మరికొందరు టీమ్ సభ్యులు కూడా మొగిలయ్య చికిత్స కోసం సాయం చేశారని సమాచారం. అదొక దీర్ఘకాలిక వ్యాధి కావడంతో మొగిలయ్య ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయ్యారు. అలా ఎన్నోసార్లు ఈ వ్యాధి నుండి తాత్కాలికంగా బయటపడ్డారు. ఆయన ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఎన్నోసార్లు బలగం వేణు తనను స్వయంగా వెళ్లి కలిశాడు. అలా వారి కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు.
ఆర్థికం సాయం
‘బలగం’ సినిమా విడుదలయిన తర్వాత మొగిలయ్య గురించి చాలామంది తెలిసింది. అందుకే ఇలాంటి ఒక జానపద కళాకారుడికి సాయం చేయడం కోసం ప్రభుత్వం సైతం ముందుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం పొన్నం సత్తయ్య అవార్డ్ ఫంక్షన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. అలా మొగిలయ్య ఆరోగ్యం కోసం ఎవరు ఎంత ఆర్థిక సాయం చేసినా కూడా తను కిడ్నీ ఫెయిల్యూర్‌తోనే మరణించారని అందరూ ఆయన జానపద గీతాలను గుర్తుచేసుకొని వాపోతున్నారు. ఆయన వెళ్లిపోతూ ‘బలగం’ లాాంటి మాస్టర్‌పీస్ ఇచ్చేసి వెళ్లారని ఫీలవుతున్నారు.
మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏🙏
బలగం సినిమా క్లైమాక్స్ లో అయన గాత్రం ఎప్పటికి మర్చి పోలేనిది 🙏🙏
అయన చివరి దశలో అయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏#chinduyakshaganam pic.twitter.com/KeSL7tHlpE— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) December 19, 2024