Balakrishna Remuneration..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుక్త వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన..తన తండ్రి, టాలీవుడ్ దిగ్గజ నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR)నటించి, దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో కీ రోల్ పోషించి,ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారిన బాలయ్య.. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అంతేకాదు గత ఏడాది సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు బాలకృష్ణ. ఇకపోతే ఆరు పదుల వయసు దాటినా సరే వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
గత నాలుగు చిత్రాలతో భారీ విజయం..
ముఖ్యంగా ఈ వయసులో కూడా మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో మెప్పించడం అంటే అంత సులభమైన పని ఏమీ కాదు. అయినా సరే బాలయ్య తన స్ట్రాటజీ చూపిస్తూ అభిమానులను అబ్బుర పరుస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ నటించిన గత నాలుగు చిత్రాలు గమనిస్తే.. అన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను(Boyapati sreenu) దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సినిమా మొదలుకొని నేడు బాబీ కొల్లి (Bobby kolli ) దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ వరకు అన్ని సినిమాలు బాలయ్యకు మంచి ఇమేజ్ అందించాయని చెప్పవచ్చు. అంతేకాదు బాలయ్య నటించిన గత నాలుగు చిత్రాలలో.. సినిమా సినిమాకి కూడా తన రెమ్యూనరేషన్ ను పెంచేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా అఖండ సినిమాతో బాలయ్య జాతకమే మారిపోయిందని చెప్పవచ్చు. అలా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా కోసం రూ. 8కోట్ల పారితోషకం తీసుకున్నారు.
సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుతున్న బాలయ్య..
2023లో ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh malineni) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా ఊచకోత కోసింది.ఈ సినిమాకి బాలకృష్ణ 12 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకున్నారు. ఆ తరువాత అదే ఏడాది అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేశారు బాలయ్య. ఈ సినిమా కోసం ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమా కోసం బాలయ్య 27 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఆ జాబితాలోకి చిరంజీవి తర్వాత బాలయ్యే..
అంతేకాదు అఖండ సీక్వెల్ ‘అఖండ 2’ కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల రూపాయల పారితోషకం తీసుకోబోతున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఐదేళ్లలోనే బాలయ్య రెమ్యూనరేషన్ దాదాపు 5 రెట్లు పెరిగిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వాస్తవానికి సీనియర్ హీరోలలో ఒక్క మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) మినహా ఇంకెవరు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలయ్య కూడా చేరిపోయారని చెప్పవచ్చు.