Bhakta Prahlada:మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు భక్తి చిత్రాలు అంటే కాస్త ఇష్టం ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా భక్తి సినిమాలు తీసే విషయంలో కూడా టాలీవుడ్ అటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చాలా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఎంతోమంది ప్రముఖ నటులు భక్తి సినిమాలలో కీలకపాత్రలో అద్భుతంగా నటించి, ఆ తర్వాత రాజకీయాల్లో కూడా చేరి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా కొన్ని దేవత మూర్తులను గుర్తు చేసుకుంటే అందులో నటించిన తారలే గుర్తుకొస్తారు. ఉదాహరణకు సీనియర్ ఎన్టీఆర్ ( Sr.NTR ) ను తీసుకుంటే రాముడు, కృష్ణుడి పాత్రలలో లీనమైపోయి నటించారు. ఘటోత్కచుడి పాత్రకు ఎస్వీ రంగారావు (SV. Rangarao) సీతాదేవి పాత్రకు అంజలి (Anjali)వంటి తారలు ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. అంతలా భక్తి పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే అప్పట్లో భక్తిరస కావ్యంగా వచ్చిన ‘భక్త ప్రహ్లద ‘ సినిమా విడుదల అయి నేటితో 93 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1932 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా ఒక సరికొత్త అధ్యాయం సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో ప్రసారమైందంటే ఆడియన్స్ వీక్షిస్తూనే ఉంటారు. మరి 93 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
భక్త ప్రహ్లాద సినిమా విశేషాలు..
ఒకరకంగా చెప్పాలి అంటే.. ఈరోజు తెలుగు సినిమాకి పండుగ రోజు.. ఎందుకంటే మొట్టమొదటి పూర్తి నిడివి ఉన్న తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’. దాదాపు 93 ఏళ్ల క్రితం ఈరోజే విడుదలయ్యింది. ఇదిలా ఉండగా.. 1931 మార్చి 14న తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలయ్యింది. ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో హెచ్ఎం రెడ్డి (HM Reddy) పనిచేయగా, ఆయనే ఈ భక్త ప్రహ్లాద సినిమాకి దర్శకత్వం వహించారు.. ఆలమ్ ఆరా సినిమా విడుదలైన 7 నెలల తర్వాత తొలి దక్షిణ భారతీయ భాష టాకీ ‘కాళిదాసు’ సినిమాని హెచ్ఎం రెడ్డి రూపొందించారు. ముంబై కేంద్రంగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇక అదే హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో 10 రీళ్ల తెలుగు టాకీగా భక్త ప్రహ్లాద సినిమా రూపుదిద్దుకుంది. ఇక ఈ సినిమా నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల అన్నీ కూడా ముంబైలోనే జరిగాయి. ఈ సినిమాను అప్పట్లో కేవలం 18 వేల రూపాయలతో 18 రోజుల్లోనే నిర్మించారు.
నటీనటులు వీరే..
ఇందులో ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ‘సురభి’ నాటక సంస్థ నటీనటులతోనే ఇందులో ఎక్కువ వేషాలు వేయించి, ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడు గా మునిపల్లె సుబ్బయ్య, ఆయన భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు, ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మొదట విజయవాడ శ్రీ మారుతి హాలు, రాజమండ్రి శ్రీకృష్ణ హాలులో ప్రదర్శించడం జరిగింది. భక్త ప్రహ్లాద సినిమాను తొలుత ముంబైలోని కృష్ణ సినిమా హాల్లో విడుదల చేశారు. అక్కడ రెండు వారాలు ఆడిన తర్వాతనే తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడం జరిగింది.