Big TV Kissik Talks:గంగవ్వ (Gangavva) .. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె తెలంగాణకు చెందినవారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఉనికిని చాటుకున్న ఈమె.. ఇక్కడ తన కామెడీతో అందరినీ ఆకట్టుకునేవారు. అలా ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న గంగవ్వ.. ఏకంగా ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ 4 (Bigg Boss 4) లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కొద్దిరోజులు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లలో పాల్గొని.. యంగ్ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన గంగవ్వ..అక్కడ ఆరోగ్యం సహకరించక.. ఎక్కువ రోజులు ఉండలేక.. బయటకు వచ్చింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ‘ఉత్తమ పాత్రికేయురాలి’గా ‘తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళ’ పురస్కారాన్ని కూడా అందుకుంది.
కిస్సిక్ టాక్స్ లో సందడి చేసిన గంగవ్వ..
ఇకపోతే గంగవ్వ సినిమాలలో కూడా నటించింది. 2019లో వచ్చిన ‘మల్లేశం’ అనే సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజరాజ చోరా’, ‘లవ్ స్టోరీ’, ‘ఇంటింటి రామాయణం’,’ కిస్మత్’, ‘భరతనాట్యం’ ఇలా పలు చిత్రాలలో పలు పాత్రలు పోషించి, తన అద్భుతమైన నటనతో ఇటు వెండితెర ఆడియన్స్ ని కూడా పలకరించింది.
ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా కొద్ది రోజులు ఉండి మళ్లీ బయటకు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం మళ్లీ తన ఛానల్లోనే యాక్టివ్ గా ఉన్న గంగవ్వ.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమం గెస్ట్ గా వచ్చింది. జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్లో సందడి చేసిన గంగవ్వ.. తన రాజకీయ ఎంట్రీపై కూడా స్పందించినట్లు ప్రోమోలో చూపించారు.
త్వరలో గంగవ్వ రాజకీయ ఎంట్రీ..
ఇంటర్వ్యూలో భాగంగా వర్షా మాట్లాడుతూ.. గంగవ్వ మీరు ప్రస్తుత సీఎం కి ఏదో వండి పెట్టారంట కదా? అని ప్రశ్నించగా.. గంగవ్వ మాట్లాడుతూ.. “అవును, మా ఊరి దగ్గర పూడూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన రేవంత్ రెడ్డికి నేను మిరపకాయ బజ్జీలు తీసుకెళ్లి ఇస్తే.. ఆయన తిన్నారు” అంటూ తెలిపారు. మాటలో మాటగా వర్షా మాట్లాడుతూ..” గంగవ్వ మీకు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి, ఏదైనా పదవి ఇస్తే మీరు చేస్తారా? ” అని ప్రశ్నించగా.. గంగవ్వ మాట్లాడుతూ..” తప్పకుండా చేస్తాను. నా మైండ్ లో కూడా అదే ఆలోచన ఉంది. సీఎం గారు ఎలాంటి పదవి ఇచ్చినా సరే నేను చేయడానికి సిద్ధం” అంటూ గంగవ్వ తన రాజకీయ ఎంట్రీ పై కామెంట్లు చేసింది.
మొత్తానికైతే గంగవ్వ తన మనసులో మాటను బయటపెట్టింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గంగవ్వ మాటలను పరిగణలోకి తీసుకొని పదవి ఇస్తారా? అనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై సీఎం ఆలోచన ఎలా ఉందో చూడాలి. మొత్తానికైతే గంగవ్వ ఆలోచనలు , ఈ కిస్సిక్ టాక్స్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSOR EAD:Rajendra Prasad : మాస్ జాతర స్టోరీ లీక్ చేసిన రాజేంద్ర ప్రసాద్.. ఫ్లోలో మొత్తం చేప్పేశాడా ?