Bigg Boss 18 Grand Finale : బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద సీజన్ ‘బిగ్ బాస్ హిందీ సీజన్ 18’కు (Bigg Boss 18 Grand Finale) త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. ఈసారి సీజన్ 18లో గొడవలు, వాదనలు, ఘర్షణలు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగానే చూసారు ప్రేక్షకులు. త్వరలోనే బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరగబోతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలే స్పెషల్ గెస్ట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది.
‘బిగ్ బాస్ 18’ గ్రాండ్ ఫినాలకి గెస్ట్ గా…
‘బిగ్ బాస్ సీజన్ 18’కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 18 ప్రస్తుతం గ్రాండ్ ఫినాలేకి సిద్ధమవుతోంది. జనవరి 19 న ఈ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అయితే ఈ ఈవెంట్ కి రష్మిక మందన్నని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఈ షోకు పోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ – రష్మిక మందన్న కాంబినేషన్లో ప్రస్తుతం ‘సికందర్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంటే ‘బిగ్ బాస్ సీజన్ 18’ గ్రాండ్ ఫినాలేలో ‘సికందర్’ టీం సందడి చేయబోతోంది. అందులో భాగంగానే రష్మిక మందన్న కూడా ఈ గ్రాండ్ ఫినాలేలో భాగం కాబోతోందని తెలుస్తోంది.
టాప్ 6 కంటెస్టెంట్స్ వీళ్ళే
ఇక బిగ్ బాస్ 18 లో 6 మంది మాత్రమే గ్రాండ్ ఫినాలేకి చేరుకోగలిగారు. షో 18 మంది కంటెస్టెంట్స్ తో మొదలు కాగా, గ్రాండ్ ఫినాలే లో ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ సీజన్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ గా వివియన్, కరణ్, అవినాష్, రజత్, చుమ్, ఈషా ఉన్నారు. మరి వీరిలో ‘బిగ్ బాస్ 18’ ట్రోఫీని అందుకునేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
షూటింగ్ దశలో ‘సికందర్’
ఇక ‘సికందర్’ (Sikandar) సినిమా విషయానికి వస్తే… సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ‘గజిని’ సినిమాతో మంచి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ‘సికందర్’ మూవీకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సాజిద్ నదియావాలా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘సికిందర్’ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ మూవీని 2025 ఈద్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
రష్మిక మందన్న గాయం?
ఇటీవల రష్మిక మందన్న జిమ్లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలేలో ఆమె భాగం కాబోతుందని వస్తున్న వార్తలు చూస్తుంటే, రష్మిక గాయం నుంచి కోలుకున్నట్టు అర్థమవుతుంది. ఆమె గాయం పరిస్థితి ఎలా ఉందోన్న విషయంపై ఇంకా అప్డేట్ రాలేదు.