Jabardasth: ఇప్పుడంటే జబర్దస్త్ ఎక్కువ చూడడం లేదు కానీ, ఒకప్పుడు ఆ షో కోసం కుటుంబం మొత్తం ఎదురుచూస్తూ ఉండేది. ముఖ్యంగా నాగబాబు, రోజా జడ్జీలుగా ఉన్నప్పుడు జబర్దస్త్ షో ఎంతో బావుండేది. ఉన్నా కొద్దీ ఈ షోలో కామెడీ పోయి వల్గారిటీ వచ్చింది. ఆ తరువాత జడ్జీలు మారుతూ వచ్చారు.
ఇక ఈ మధ్య అయితే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ ను తీసేసి.. జబర్దస్త్ గా మార్చారు. ఈ షోకు ఎంతమంది జడ్జీలు వచ్చినా నాగబాబును, రోజాను మర్చిపోవడం చాలా కష్టం. వీరి తరువాత ఆ సీట్ కు అందం తెచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది కమెడియన్ కృష్ణ భగవాన్ మాత్రమే. సినిమాల్లో తన కామెడీతో ఎంతోమందిని నవ్వించిన ఆయన.. కొన్నేళ్లుగా జబర్దస్త్ కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.
ఖుష్బూ, ఇంద్రజ అంటూ పక్కన ఉన్నవారు మారుతున్నా.. కృష్ణ భగవాన్ మాత్రం మారలేదు. తన పంచ్ లతో ఆయన కొద్దిగా నాగబాబును గుర్తుచేశాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కృష్ణ భగవాన్ ప్లేస్ లో కొత్త జడ్జీ రావడం షాకింగ్ కు గురి చేస్తోంది.
తాజాగా ఈ షోకు బిగ్ బాస్ శివాజీ జడ్జ్ గా వచ్చాడు. రష్మీ, ఆయనను పుష్ప గుచ్చం అందించి జబర్దస్త్ లోకి ఆహ్వానించింది. ఇందుకు సంబందించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన శివాజీ.. హీరోగా కూడా మారి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత టీడీపీకి సపోర్ట్ గా నిలబడి ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నాడు.
ఇక కొన్నేళ్ల క్రితం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి పెద్దన్న గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకోపక్క #90s వెబ్ సిరీస్ తో ఫ్యామిలీస్ కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శివాజీ.. జబర్దస్త్ జడ్జీగా వచ్చాడు.
అయితే శివాజీ రావడంతో ఆనందపడాలో.. కృష్ణ భగవాన్ కు ఏమైందో అని ఆందోళన పడాలో తెలియడం లేదు. సడెన్ గా కృష్ణ భగవాన్ ను తప్పించి శివాజీని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి శివాజీ రాక.. జబర్దస్త్ కు పూర్వ వైభవాన్ని ఇస్తుందో లేదో చూడాలి.