Bollywood : ప్రముఖ బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (Deb Mukharjee) తాజాగా కన్ను మూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా దేబ్ ముఖర్జీ ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ముఖర్జీ నటించిన సినిమాలలో అధికార్, జో జీతా వోహీ సికిందర్, అన్సూ బాన్ గయే ఫూల్, అభినేత్రి, దో ఆంఖేన్, బాటన్ బాటన్ మే, కమీనీ, గుడ్గుడీ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukharjee) హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు అన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ‘వార్ 2’ అనే భారీ యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేబ్ ముఖర్జీ కన్నుమూతతో బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ‘వార్ 2’ మూవీకి ఆయన అంత్యక్రియలు ముగిసేదాకా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దేబ్ ముఖర్జీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, సోషల్ మీడియాలో ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు
దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని జుహులోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి. కాజోల్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, అలియా భట్, తనీషా, రాణి ముఖర్జీ, తనూజ, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, ఇతర ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు ఈరోజు ముంబైలో జరిగే దేబ్ ముఖర్జీ అంత్యక్రియలకు హాజరవుతారు.
దేబ్ ముఖర్జీ కాజోల్ కు బంధువు
దేబ్ ముఖర్జీ సోదరుడు జాయ్ ముఖర్జీ కూడా నటుడే. ఆయన మరో సోదరుడు షోము ముఖర్జీ నటి కాజోల్ తల్లి తనుజాను వివాహం చేసుకున్నాడు. కాజోల్ అతనికి కూతురు వరుస అవుతుంది. దుర్గా పూజ సమయంలో దేబు తరచుగా కాజోల్‌ను ముద్దు చేస్తూ కంపించేవాడు. చాలా సంవత్సరాలుగా దేబ్ ముఖర్జీ ముంబైలో అతిపెద్ద దుర్గా పూజా ‘నార్త్ బాంబే సర్వజనిక్ దుర్గా పూజ పండల్’ను నిర్వహిస్తున్నారు. అతనితో పాటు, కాజోల్, రాణి ముఖర్జీ ఈ పూజను నిర్వహించడంలో సహాయం చేసేవారు. ప్రతి సంవత్సరం ముంబైలో జరిగే ఈ అతిపెద్ద దుర్గా ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తరలి వస్తారు.
‘వార్ 2’ షూటింగ్ కి బ్రేక్
ఓ వైపు దేశమంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంటే, బాలీవుడ్ లో మాత్రం దేబ్ మృతితో విషాదం నిండింది. ఈ నేపథ్యంలోనే అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాల పలు అడ్డంకుల కారణంగా ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అయాన్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతలోనే ఆయన తండ్రి మరణంతో ఈ మూవీకి మరోసారి బ్రేకులు పడ్డాయి.