Jaat Movie : ప్రముఖ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) రూపొందించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాట్’. తాజాగా ఈ మూవీలోని ఓ సన్నివేశం కారణంగా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అంతేకాకుండా హీరోతో పాటు దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేశారు. దీంతో ‘జాట్’ మూవీ విషయంలో వివాదం మొదలైంది.
ఇంతకీ ఆ సీన్ ఏంటంటే?
ఇటీవల కాలంలో సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలు ఎక్కువవుతున్నాయి. సినిమా అలా రిలీజ్ అయ్యిందో లేదో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఏదో ఒక వర్గం వివాదం రాజేయడం అన్నది ఈరోజుల్లో సర్వసాధారణం. ‘జాట్’ మూవీ విషయంలో మాత్రం ఇది కాస్త ఆలస్యంగా జరిగింది. ఈ సినిమాలో ఏసుక్రీస్తును శిలువ వేసిన ఘటనను పోలిన సీన్ ఉందని, దాని వల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశారని పంజాబ్ జలంధర్ లోని సదర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి కంప్లైంట్ చేశాడు. తన కంప్లైంట్ లో హీరో సన్నీ డియోల్, విలన్ రణదీప్ హుడా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ‘జాట్’ సినిమా నిర్మాత నవీన్ యెర్నేనిలపై ఈ మేరకు కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి కంప్లైంట్ మేరకు పోలీసులు ‘జాట్’ టీంపై సెక్షన్ 299 బిఎంఎస్ ((ఉద్దేశ పూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి చేసే పనులు)) కింద కేసును ఫైల్ చేశారు.
‘జాట్’ను బ్యాన్ చేయాలని డిమాండ్
ఎఫ్ఐఆర్ ప్రకారం “దర్శకుడు, రచయిత, నిర్మాత ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని పవిత్రమైన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మాసాలలో రిలీజ్ చేశారు. దీనివల్ల క్రైస్తవులు ఈ విషయంపై మండిపడతారు. ఫలితంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి అశాంతి వ్యాప్తి చెందుతుంది” అని ఆరోపించాడు సదరు ఫిర్యాదుదారుడు. అంతేకాదు సినిమాను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశాడు.
సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా యాక్షన్ చిత్రం ‘జాట్’. దీనికి “డాన్ శీను”, “బాడీగార్డ్”, “వీరసింహా రెడ్డి” వంటి హిట్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా, ప్రశాంత్ బజాజ్, జరీనా వహాబ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషించగా, రణదీప్ హుడా మెయిన్ విలన్ గా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఏప్రిల్ 10 న విడుదలైంది. విడుదలైన ఏడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
Read Also : ‘పెద్ది’ కోసం రంగంలోకి కాజల్…. మరో జిగేల్ రాణి అవుతుందా?
ఈ నేపథ్యంలోనే మూవీలో అభ్యంతరక సన్నివేశాలు ఉన్నాయంటూ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. చాలా వరకు ఇలాంటి కేసులు మూవీకి ప్రీ పబ్లిసిటీని తెచ్చి పెడతాయి. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? మూవీ కలెక్షన్స్ మరింతగా పెరగడానికి ఈ వివాదం హెల్ప్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.