Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు (Dil Raju) తో పాటు పలువురు నిర్మాతల ఇళ్లపై, ఆఫీసులపై, నిర్మాణ సంస్థలపై నిన్నటి నుంచి ఐటీ మెరుపు దాడులు (IT Raids) చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు తనపై జరిగిన ఐటి దాడులపై స్పందించారు.
ఐటీ దాడులపై దిల్ రాజు రియాక్షన్
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మాణ సంస్థ, హైదరాబాద్ లోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై రియాక్ట్ అయ్యారు. ఐటీ సోదాలు కేవలం తన ఒక్కడిపై మాత్రమే జరగలేదని అన్న ఆయన, ఇండస్ట్రీ మొత్తం మీద ఈ సోదాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం రోజు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దిల్ రాజు మీడియాకు అభివాదం చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. అయితే రెండో రోజు కూడా నిర్మాతల ఇళ్ళపై ఐటీ సోదాలు కొనసాగుతుండడం గమనార్హం.
కేసు నమోదు చేశాకే సోదాలు?
టాలీవుడ్ లో దిల్ రాజు (Dil Raju) నిర్మాణ సంస్థపై మాత్రమే కాకుండా, మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత నవీన్ ఎర్నేని, మ్యాంగో మూవీస్ వంటి సంస్థలపై ఐటి దాడులు చేస్తోంది. గత రెండు రోజుల నుంచి దిల్ రాజు ఇళ్ళు, ఆఫీసులపై కూడా అధికారులు తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడాలు ఉండడంతో ఇప్పటికే పలు సంస్థలకు చెందిన వ్యాపారాలు లావాదేవీల డాక్యుమెంట్స్ ను ఐటి స్వాధీనం చేసుకుంది. అలాగే వారికి సంబంధించిన లాకర్లను కూడా ఐటి తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో మొత్తం 55 ఐటి బృందాలు పాల్గొనడం సంచలనంగా మారింది. అయితే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాల నిర్మాణానికి దిల్ రాజు భారీగా బడ్జెట్ పెట్టడం, ఈ రెండు చిత్రాల కలెక్షన్ల వ్యవహారంపై కూడా తనిఖీలు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది.
ఐటీ దాడులపై దిల్ రాజు భార్య స్పందన
ఈ ఐటీ దాడులు కేవలం దిల్ రాజు (Dil Raju)పై మాత్రమే కాకుండా ఆయన సోదరుడు శిరీష్, కూతురు హర్షిత రెడ్డి ఇళ్లపై కూడా జరిగాయి. ఈ దాడుల గురించి దిల్ రాజు భార్య తేజస్విని మాట్లాడుతూ అధికారులు బ్యాంక్ లాకర్లను తనిఖీ చేయడానికి తమను తీసుకెళ్లారని ఆమె అన్నారు. ఈ దాడులు అన్నీ సినీ పరిశ్రమకు సంబంధించినవేనని, అవన్నీ సాధారణ ఐటీ తనిఖీలని తేజస్విని చెప్పుకొచ్చారు.