Emergency Movie : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) లీడ్ రోల్ పోషించిన మూవీ ‘ఎమర్జెన్సీ’ (Emergency). ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమాను కేవలం రూ.99 కే చూడవచ్చు. మల్టీ ప్లెక్స్ లలో కూడా ఇదే టికెట్ ధరకు చూడవచ్చు. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే ఈ గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ఒక్క రోజు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సినిమా లవర్స్ డే స్పెషల్
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) శుక్రవారం అంటే జనవరి 17న థియేటర్లలోకి రానుంది. ఈ ప్రత్యేకమైన రోజే సినిమా లవర్స్ డే. ఈ సందర్భంగా బాలీవుడ్ క్వీన్ తన రాబోయే చిత్రాన్ని మల్టీప్లెక్స్‌లలో రూ.99కి స్క్రీనింగ్ చేయడానికి సిద్ధమైంది. కంగనా రనౌత్ తో పాటు ఆమె అభిమానులు చాలాకాలంగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ టిక్కెట్ ధర ఆ ఒక్క రోజు మాత్రం కేవలం రూ. 99 మాత్రమే. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ‘ఎమర్జెన్సీ’ చిత్రం 1975లో భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.
అక్కడ ‘ఎమర్జెన్సీ’ బ్యాన్
కంగనా రనౌత్‌తో పాటు ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, విశాఖ నాయర్, దివంగత సతీష్ కౌశిక్ కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కంగనా ‘ఎమర్జెన్సీ’లో నటించడమే కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, పుపుల్ జైకర్‌గా మహిమా చౌదరి, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, సంజయ్ గాంధీగా విశాల్ నాయర్, జగ్జీవన్ రాంకు పాత్రలో సతీష్ కౌశిక్ కనిపించనున్నారు. బంగ్లాదేశ్‌లో ‘ఎమర్జెన్సీ’ సినిమాపై నిషేధం విధించారు. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా ఈ చిత్రం అక్కడ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.
‘ఎమర్జెన్సీ’కి పోటీగా మరో మూవీ
‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రం 2024లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మూవీ రిలీజ్ సమస్యలు, రిలీజ్ పై కంగనా కోర్టుకు వెళ్ళింది. దీంతో ఈ సినిమా విడుదలకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఇప్పుడు మూవీ అన్నీ అడ్డంకులను దాటుకుని రిలీజ్ అవుతుంది అనుకుంటే, పోటీగా మరో మూవీ రిలీజ్ అవుతోంది. అమన్ దేవగన్, రాషా తడాని నటించిన ‘ఆజాద్’ సినిమాతో ‘ఎమర్జెన్సీ’ పోటీ పడనుంది. రాషా, అమన్‌లకు ఇదే మొదటి సినిమా. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కంగనా నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో ఈ సినిమాపైనే కంగనా ఆశలన్నీ పెట్టుకుంది. మరి ‘ఎమర్జెన్సీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు వసూళ్లు సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.