Lalit Modi Vanuatu Passport| భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీకి కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) పసిఫిక్ ద్వీప దేశమైన ‘వనుఆటు’కు (Vanuatu) మకాం మార్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం వనుఆటు దేశానికి చెందిన గోల్డెన్ పాస్ పోర్టును పొందినట్లు సమాచారం. అయితే, ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనుఆటు ప్రధాని జోథం నపాట్ (Jotham Napat) పౌరసత్వ కమిషన్‌కు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.
‘‘దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్‌తో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే, గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్ పోల్‌కు రెండుసార్లు అభ్యర్థనలు చేసినట్లు మాకు తెలిసింది. అయితే, తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్ పోల్ తిరస్కరించింది. వనుఆటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలి. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతను వనుఆటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది. అతను చూపిన కారణం చట్టబద్ధంగా లేకపోవడంతో మేము జారీ చేసిన పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని వనుఆటు ప్రధాని పేర్కొన్నారు.
భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లు శిక్షలు తప్పించుకోవడానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. వారిని తిరిగి భారత్ దేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు వారు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వాలను స్వీకరిస్తున్నారు. భారత్‌తో “నేరస్థుల అప్పగింత ఒప్పందం” లేని చిన్న చిన్న దేశాల నుంచి పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొంత మొత్తంలో పెట్టుబడులు పెడితే తమ దేశ పౌరసత్వాన్ని కూడా ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి.
Also Read: నేను ఒక్క బటన్ నొక్కితే ఉక్రెయిన్ సైన్యం ఫినిష్.. జెలెన్‌స్కీని బెదిరించిన మస్క్
ఈ దేశాలు అందిస్తున్న సదుపాయాన్ని ఉపయోగించుకుని.. ఈ పరారీ మోసగాళ్లు తమ దగ్గరున్న అక్రమ సొమ్ముని పెట్టుబడి పెట్టి పౌరసత్వాన్ని సులభంగా పొందుతున్నారు. ఇలా దేశం నుంచి పారిపోయి విదేశీ పౌరసత్వం తీసుకున్న వారిలో ఇప్పటికే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉండగా.. తాజాగా ప్రముఖ లలిత్ మోదీ చేరారు. ఆయన పసిఫిక్ ద్వీప దేశం ‘వనుఆటు’ పౌరసత్వాన్ని పొందారు.
లలిత్ మోదీ వనుఆటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో తన భారత పాస్‌పోర్ట్ ని అప్పగించేందుకు లండన్‌లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. దానిని నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. అతడిపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. లలిత్ మోదీ ఐపీఎల్‌కు బాస్ గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత అధికారులకు దొరకకుండా గత 15 ఏళ్లుగా లండన్‌లో తల దాచుకున్నాడు. అతడిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లలిత్ పసిఫిక్ ద్వీప దేశమైన వనుఆటుకు మకాం మార్చేందుకు ప్లాన్ వేశాడు.
ఎందుకంటే వనుఆటులో వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకొని.. దేశం బయటి నుంచి ఆదాయాన్ని పొందినా, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాగే గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్లు లేవు. అంతేకాకుండా ఆ దేశం క్రిప్టో హబ్గా వృద్ధి చెందుతోంది. ఆ దేశంలో అసలు ఆదాయ పన్ను అసలు లేదు. స్థానిక సంపాదన అయినా అంతర్జాతీయంగా వచ్చే ఆదాయం అయినా దేనిపైనా అక్కడ ఆదాయపన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను కూడా ఉండదు. ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.