Dhanush: తమిళంలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలపై పలు విధాల ఆరోపణలు వచ్చాయి. అలాంటి హీరోల లిస్ట్‌లో శింబు, ధనుష్ లాంటి హీరోలు కూడా ఉన్నారు. వీరు ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టినా నిర్మాతలతో వీరి ప్రవర్తన కరెక్ట్‌గా ఉండదంటూ ఇప్పటికే పలువురు నిర్మాతలు వీరిపై ఆరోపణలు చేశారు. ఇక కోలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగినా ధనుష్ మాత్రం ఇప్పటికీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. తాజాగా తనతో కలిసి రెండు సినిమాలు చేసిన నిర్మాత కూడా ధనుష్ ప్రవర్తన గురించి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా ఇప్పటివరకు ధనుష్‌పై ఎవరూ యాక్షన్ తీసుకోకపోవడానికి రాజకీయ జోక్యమే కారణమన్నాడు.
పట్టించుకోవడం లేదు
ధనుష్ హీరోగా ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’ అనే రెండు సినిమాలను నిర్మించిన నిర్మాత 5 స్టార్ కథీరేశన్ (Five Star Kathiresan). తాజాగా ధనుష్ తనకు కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన ఆర్కే సెల్వమణికి ఫిర్యాదు చేశాడు కథీరేశన్. ఇప్పటికే తనతో ఒక సినిమా చేయడానికి ధనుష్‌కు తాను అడ్వాన్స్ ఇచ్చానని, అయినా కూడా ఇప్పటివరకు తమ ప్రాజెక్ట్ కోసం కాల్ షీట్స్ ఇవ్వలేదని వాపోయాడు. ఇంతకు ముందు జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా తను ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశాడు కథీరేశన్. కనీసం ఇప్పటికైనా ఈ విషయంపై యాక్షన్ తీసుకోవాలని కోరాడు.
డిస్టర్బ్ చేయొద్దు
ప్రస్తుతం ధనుష్ (Dhanush) ‘ఇడ్లీ కడయ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ధనుష్‌ను డిస్టర్బ్ చేయవద్దని పైనుండి ఆర్డర్స్ వచ్చాయని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. ఇంతకు ముందు ధనుష్‌తో ఇలాంటి సమస్య ఉందని చెప్పినప్పుడు అక్టోబర్ 30 లోపు తనకు న్యాయం చేస్తానని సెల్వమణి మాటిచ్చారని, అది మర్చిపోయారని కథీరేశన్ తెలిపాడు. తను కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించలేదని, ఇప్పటికే ధనుష్‌తో రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశానని గుర్తుచేశాడు. ఫిల్మ్ ఫెడరేషన్ అనేది అందరికీ సమానంగా న్యాయం చేయడానికే ఉందని కానీ రాజకీయ జోక్యం వల్ల అలా జరగడం లేదని ఆరోపించాడు.
Also Read: భార్యతో గొడవ అయితే నెగిటివ్ రివ్యూలు.. మరోసారి రెచ్చిపోయిన ప్రొడ్యూసర్
ఇబ్బందులు పడుతున్నారు
పర్సనల్ ఎజెండా కోసమే కథీరేశన్ ఇలా చేస్తున్నాడని పలువురు ఆరోపించగా ఆ ఆరోపణలను తను కొట్టిపారేశాడు. తన కంపెనీకి న్యాయం జరగాలనే ఇలా చేస్తున్నానని తెలిపాడు. తను, తన టీమ్ ఎదుర్కుంటున్న ఇబ్బందులను గమనించి తమకు న్యాయం చేయాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను కోరాడు. హీరోలు ఇలా కమిట్మెంట్స్ పాటించకపోవడం వల్ల, కాల్ షీట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపాడు. తనతో పాటు అలా ఇబ్బందులు ఎదుర్కుంటున్న అందరు నిర్మాతలకు న్యాయం చేయాలని కోరాడు. ఏ రాజకీయాల జోక్యం వల్ల తమ నిర్ణయాలు మారిపోకూడదని అన్నాడు కథీరేశన్.