Ration Card News: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఊహించని శుభవార్త. రానున్న మూడు నెలల రేషన్ జూన్ ఒకటి నుంచి పంపిణీ చేయనున్నారు. అంటే ఆదివారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రత కార్డు కలిగిన వారికి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మూడు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు ఒకేసారి సన్నబియ్యం అందించనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల పరిధిలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ అందించేందుకు ఏర్పాటు చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ అందుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే జనగామ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు కూడా.
జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 335 రేషన్ షాపులున్నాయి. వాటి పరిధిలో లక్షా 63 వేల 283 రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. పాత రేషన్ కార్డులతోపాటు కొత్త రేషన్ కార్డులకు సైతం మూడు నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వనున్నారు.
ALSO READ: రాజీవ్ యువ వికాసం స్కీమ్, మొదటి లిస్టు రెడీ
జూన్ 1 నుంచి 30 వరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని లబ్దిదారులకు ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఒకేసారి మూడు నెలల కోటా ఇవ్వడంతో దానికి సరిపడిన నిల్వలు, పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి నైరుతి రుతుపవనాలు వేగంగా రావడం, వర్షపాతం ఈసారి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడం కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది.
బియ్యంతోపాటు పంచదార, గోధుమలు రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇవ్వనున్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తారు. మూడు నెలల సరకులు పంపిణీ దృష్ట్యా వేలిముద్రలు, ఐరిస్ చూడాలని అంటున్నారు రేషన్ డీలర్లు.
జాతీయ ఆహార భద్రత ఎన్ఎఫ్సీ కార్డు కింద కుటుంబంలో ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల బియ్యం ఇవ్వనున్నారు. అంత్యోదయ ఆహార భద్రత కార్డు కింద ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. అలాగే అంత్యోదయ అన్న యోజన కార్డు కింద 10 కిలోలు ఇవ్వనున్నారు. ఈ లెక్కన కార్డు వినియోగదారులు దాదాపు 100 కిలోల బియ్యాన్ని అందుకోవడం ఖాయం.