Dil Raju Mother Health Update: గత మూడు రోజులుగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే దిల్ రాజు ఇంట్లో కూడా జరిగాయి. అదే సమయంలో దిల్ రాజు మదర్‌కు ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. నియమాల ప్రకారం ఐటీ అధికారుల వాహనాల్లోనే దిల్ రాజు తల్లిని ఆసుపత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించారు. భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ విషయంపై దిల్ రాజు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
భయపడాల్సిన పనిలేదు
దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో తన తల్లికి అస్వస్థతగా అనిపించడం మొదలయ్యింది. అందుకే ఐటీ అధికారులకు సంబంధించిన వాహనాలలోనే తనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు ఐటీ శాఖకు చెందిన ఒక మహిళా అధికారి కూడా వారితో పాటు హాస్పిటల్‌కు వెళ్లారు. మిగిలిన అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు కంటిన్యూ చేశారు. ఇక హాస్పిటల్‌కు తరలించిన తర్వాత దిల్ రాజు (Dil Raju) మదర్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న దిల్ రాజు తల్లి ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని డాక్టర్లు భరోసా ఇచ్చారని సమాచారం.
అందరూ ఒకేచోట
ఇక టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్న ఐటీ దాడుల విషయానికొస్తే.. గత మూడు రోజులుగా నిర్మాత దిల్ రాజు, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారి ఇళ్లు, ఆఫీసులు, వారికి సంబంధించిన బంధువుల ఇళ్లు.. ఇలా అన్నీ చోట్ల ఐటీ అధికారులు రైడ్స్ మొదలుపెట్టారు. దీనికోసం ఒకేసారి దాదాపు 200 మంది ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. వారి గత చిత్రాలకు సంబంధించిన బడ్జెట్ ఎంత, లాభాలు ఎంత, రెవెన్యూ ఎంత లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికీ ఈ విషయాలపై ఆరా కొనసాగుతూనే ఉంది. ఒకేసారి టాలీవుడ్ బడా మేకర్స్ ఇళ్లల్లో ఐటీ సోదాలు అనే అంశం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.
Also Read: అవార్డును తిరస్కరించిన ‘ఈగ’ విలన్.. అసలేమైందంటే..?
పోస్టర్ల పంచాయతీ
ఈరోజుల్లో ఏదైనా పాన్ ఇండియా సినిమా విడుదలయితే చాలు.. మొదటి రోజు పూర్తవ్వగానే ఆ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది, రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఆ పోస్టర్లే ఈ ఐటీ సోదాలకు కారణమని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాగా.. అందులో రెండు సినిమాలకు దిల్ రాజునే నిర్మాతగా వ్యవహరించారు. ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు అత్యధిక కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ స్వయంగా పోస్టర్లు విడుదల చేశారు. దానివల్లే దిల్ రాజు ఇంట్లో ఐదా సోదాలు మొదలయ్యాయని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.