Sri Tej Health Update: సంధ్య థియేటర్ వల్ల తొక్కిసలాట జరిగి ఇప్పటికీ దాదాపు మూడు వారాలు అవుతోంది. తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిన బాలుడు శ్రీ తేజ్‌కు ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతూనే ఉంది. శ్రీ తేజ్ కోలుకుంటున్నాడనే విషయం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు శ్రీ తేజ్‌కు వెంటిలేటర్, లైఫ్ సిస్టమ్ సపోర్ట్‌ను అందించారు డాక్టర్లు. కానీ గత కొన్నిరోజులుగా వాటి సాయం లేకుండానే తను ఉంటున్నాడని ఇటీవల ప్రకటించారు. ఇక గురువారం వరకు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేదానిపై కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు ఒక అప్డేట్‌ను విడుదల చేశారు.
హెల్త్ అప్డేట్
గత అయిదు రోజులుగా ఎలాంటి సపోర్ట్ లేకుండా శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అంతే కాకుండా తను ట్యూబ్ నుండి ఫీడింగ్ కూడా బాగానే తీసుకోగలుగుతున్నాడని కూడా తెలిపారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీ తేజ్‌ను చూసి తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకొని వెళ్లారు. అంతే కాకుండా ‘పుష్ప 2’ మూవీ టీమ్ అంతా తన ఆరోగ్యానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తామని మాటివ్వడంతో పాటు తన కుటుంబానికి విరాళాలు కూడా అందించారు. వారు మాత్రమే కాకుండా మరెందరో సెలబ్రిటీలు కూడా శ్రీ తేజ్ (Sri Tej) కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read: అల్లు అర్జున్ ఈగో.. సీఎం ముందు ఇండస్ట్రీ తలవంచేలా చేసింది
త్వరగా కోలుకోవాలి
ఇటీవల శ్రీ తేజ్‌ను చూడడానికి కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన అల్లు అరవింద్.. ‘పుష్ప 2’ మూవీ టీమ్ తరపున రూ.2 కోట్ల విరాళం ప్రకటించి వెళ్లారు. అందులో రూ.1 కోటి అల్లు అర్జున్ అందించాడని బయటపెట్టారు. సుకుమార్ కూడా వచ్చి శ్రీ తేజ్‌ను స్వయంగా చూడాలనుకున్నాడు కానీ తను అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోయాడు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కున్నారు. అలా శ్రీ తేజ్‌పై ప్రస్తుతం సినీ సెలబ్రిటీల మాత్రమే కాదు.. ప్రేక్షకుల ఫోకస్ కూడా పెరిగింది. త్వరలోనే ఆ బాలుడు కోలుకొని మామూలుగా అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.
ఏం జరిగిందంటే.?
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా రిలీజ్ అవ్వగా.. డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ షోకు అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలిసి ఎక్కువ సంఖ్యలోనే ప్రేక్షకులు అక్కడ ఎదురుచూడడం మొదలుపెట్టారు. అదే సమయంలో బన్నీ రోడ్ షో చేస్తూ రావడంతో చుట్టూ ఉన్న ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. తన కుమారుడు శ్రీ తేజ్‌కు జనాల మధ్య ఊపిరి ఆడలేదు. వెంటనే తనను ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు.