Shilpa Shetty ED Raid : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) ఇంటిపై ఈడీ దాడులు చేసింది. పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి ముంబై , ఉత్తరప్రదేశ్‌లోని 15 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. శిల్పాశెట్టి ఇంటి వద్ద కూడా ఈడీ దాడులు చేసినట్టు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన కొన్ని కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ చర్యలు తీసుకుంది. రాజ్ కుంద్రా అడల్ట్ కంటెంట్‌ను సృష్టించి, మొబైల్ యాప్‌ల ద్వారా పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల కింద రాజ్ కుంద్రా కొన్ని రోజులు జైలులో ఉన్నారు. అనంతరం ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేశారన్న ఆరోపణల్లో రాజ్ కుంద్రా కంపెనీ పేరు వచ్చింది. ఇదే కేసును విచారించేందుకు ఈరోజు ఉత్తరప్రదేశ్, ముంబైలోని శిల్పా శెట్టి దంపతులకి సంబంధించిన ప్రాంతాల్లో… మొత్తం 15 చోట్ల ఈడీ సెర్చ్ ఆపరేషన్ చేసింది. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాల ఇల్లు కూడా ఉంది ఈ దాడుల్లో.
శిల్పాశెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రాను క్రైమ్ బ్రాంచ్ జూలై 2021లో అరెస్టు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఈ రాకెట్‌పై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఓటీటీ, సినిమాల్లో పని చేయమని చెప్పి అమ్మాయిలను అశ్లీల చిత్రాల్లో నటించమని ఎలా బలవంతం చేస్తారో ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పాటు ముంబైలో చాలా మంది ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించి ఎంతో సంపాదిస్తున్నారని చెప్పింది. దీంతో పోలీసులు మలాద్ వెస్ట్ ప్రాంతంలోని బంగ్లాపై దాడి చేశారు. ఈ బంగ్లాను అద్దెకు తీసుకుని అక్కడ ఓ పోర్న్ సినిమా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన దాడిలో బాలీవుడ్ నటితో పాటు మరో 11 మందిని అరెస్టు చేశారు.
దీంతో పోలీసులకు రాజ్ కుంద్రా, అతని కంపెనీ గురించి సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అలాగే బాధిత అమ్మాయి స్టేట్మెంట్, వాట్సాప్ చాట్‌లు, యాప్‌లోని సినిమాలు, రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టారు పోలీసులు. 2021లో రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ 2024లో, ఇదే కేసుకు సంబంధించి 97 కోట్ల రూపాయల విలువైన రాజ్ కుంద్రా ఆస్తులను ED జప్తు చేసింది. ప్రస్తుతం రాజ్ కుంద్రా (Raj Kundra)పై మనీలాండరింగ్ నిరోధక చట్టం అంటే PMLA, 2002 కింద విచారణ జరుగుతోంది.
2018లో కూడా రాజ్ కుంద్రా (Raj Kundra) వివాదంలో చిక్కుకున్నాడు. 2000 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2018లో రాజ్ కుంద్రాను ప్రశ్నించింది. కాగా ఇప్పుడు ఈడీ తీసుకున్న ఈ చర్య వల్ల రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.