సినిమా : తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి
దర్శకత్వం : నారాయణ చెన్న
నటీనటులు: ప్రియదర్శి, శ్రీరామ్, మణికందన్ తదితరులు
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : ఆహా
Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi Review : థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అయి, ఎప్పుడు పోయిందో కూడా తెలియని మూవీ ‘తప్పించుకు తెలుగువాడు ధన్యుడు సుమతి’. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీరామ్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 9 నెలల తర్వాత ఓటీటీలో అడుగు పెట్టింది. మరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కనీసం ఓటిటి లవర్స్ ని అయినా మెప్పించిందా? అనే విషయాన్ని రివ్యూలో చూద్దాం.
కథ
సినిమా మొత్తం ఒక బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరుగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఒక క్యాబ్ డ్రైవర్ బ్యాంకు బయట వెయిట్ చేస్తాడు. అంతలోనే ఓ దొంగ బ్యాంకులో కాల్పులు జరిపి, బ్యాగ్ నిండా డబ్బులతో బయటకు వస్తాడు. అతడికి పక్కనే ఉన్న కార్ కనిపించడంతో అందులో ఎక్కి, డ్రైవర్ కి గన్ గురి పెడతాడు. ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా, అక్కడి నుంచి తనను తీసుకెళ్లమంటాడు. డబ్బులు చూసాక డ్రైవర్ కు దానిపై కనబడుతుంది. ఆ డబ్బు కోసం ఎవ్వరూ లేని ఓ ప్రదేశంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పటికే బ్యాంకులో గొడవపడి చేతికి బుల్లెట్ గాయమైన దొంగకి, ఈ గొడవలో కడుపులో మరో బుల్లెట్ దిగుతుంది. ఆ తర్వాత ఎలాగోలా పోలీసుల నుంచి తప్పించుకొని హోటల్ కి వెళ్తారు. హోటల్లో డబ్బున్న బ్యాగ్ దొంగతనం జరుగుతుంది. ఆ దొంగని వీళ్ళ కంటే ముందు పోలీసులు పట్టుకుంటారు. తీరా చూస్తే ఆ బ్యాగ్ లో డ్రగ్స్ కనిపిస్తాయి. ఈ ఊహించని ట్విస్ట్ కి అయోమయంలో పడిపోతారు దొంగ, క్యాబ్ డ్రైవర్. అంతలోనే వీళ్ళు దిగిన హోటల్ రిసెప్షనిస్ట్ వీళ్ళ డబ్బున్న బ్యాగ్ తో దర్శనం ఇస్తుంది. పైగా వీళ్ళ గన్ వీళ్ళకే గురిపెట్టి అక్కడ నుంచి వెళ్దాం అంటుంది.
మరోవైపు ఓ పల్లెటూరులో పుట్టి, పెరిగిన ప్రియదర్శి తన చిన్నప్పటి స్నేహితురాలిని ప్రేమిస్తాడు. కానీ ఓ రోజు ఆమె అతన్ని కలిసి ఇకపై మనకు వర్కవుట్ అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఒక కోటి రూపాయల అప్పు అని తెలుసుకుంటాడు హీరో. మరి హీరో ఆ కోటి రూపాయలు ఎలా సంపాదించాడు? దొంగ, క్యాబ్ డ్రైవర్ రిసెప్షనిస్ట్ లలో దొంగిలించిన డబ్బు ఎవరికి దక్కింది? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ఈ సినిమా చూడడం కన్నా చెప్పుకోవడానికే బాగుంది. మనిషి అవసరాన్ని బట్టి చెడు దారిలో ఎలా వెళతాడు అనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించాలి అనుకున్నాడు డైరెక్టర్. దానికి ప్రియదర్శి ఫేమ్ ను ఉపయోగించుకున్నాడు. కానీ నిజానికి ఈ సినిమాలో ప్రియదర్శి పాత్ర కేవలం అప్పుడప్పుడు మెరిసే ఒక గెస్ట్ రోల్ లాంటిది. అలాగే సినిమాలో కనిపించిన మిగతా నటినటులు అందరూ కొత్త ముఖాలే కావడంతో పాటు సినిమాను సాగదీసిన తీరు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. కనీసం సినిమా టెక్నికల్ అంశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉండవు. సినిమా చూసినంతసేపు దీనికంటే సీరియల్ బెటర్ అనే ఫీలింగ్, ఇరిటేషన్ కలుగుతుంది. మొత్తానికి ఈ మూవీని థియేటర్లలో తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి. మరి ఓటిటిలో తప్పించుకోలేకపోతే మేమేం చేయలేం.
Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi Rating – 1/5