Aaron Goodwin : ఇటీవల కాలంలో సెలబ్రిటీల విషయంలో విడాకుల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. కొంతమంది పెళ్ళయిన 6 నెలలకే విడాకుల బాట పడుతుంటే, మరికొంత మంది ఏకంగా పెళ్ళయిన కొన్నేళ్ళ తరువాత వైవాహిక బంధానికి గుడ్ బై చెప్తున్నారు. కానీ ఓ సెలబ్రిటీ భార్య మాత్రం తన భర్తకు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా భర్త హత్యకు కుట్ర పన్ని, అడ్డంగా పోలీసుల దగ్గర బుక్ అయ్యింది.
అసలేం జరిగిందంటే?
‘ఘోస్ట్ అడ్వెంచర్స్’ (Ghost Adventures) అనే హాలీవుడ్ టీవీ షో స్టార్ ఆరోన్ గుడ్విన్ (Aaron Goodwin) భార్య విక్టోరియా గుడ్విన్ (Victoria Goodwin) ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆమె తన భర్తను చంపడానికి ఒక హిట్ మ్యాన్‌ను నియమించుకోవడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేసినట్టు సమాచారం. 31 ఏళ్ల విక్టోరియాను గత వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలతోనే ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం విక్టోరియా 2024 అక్టోబర్ లో ఫ్లోరిడా జైలులోని ఒక ఖైదీని సంప్రదించి, తన భర్తకు సంబంధించిన హత్య డీల్ ను చేసుకుంది. ఈ మేరకు ఆ ఖైదీకి ఆరోన్ ను హర్య చేయడానికి 11,515 డాలర్లు ఇచ్చింది. “నేను అతనికి విడాకులు ఇవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అతని ఉనికే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాను” అని జైలు ఖైదీ ఫోన్ కు విక్టోరియా చేసిన మెసేజ్ లను అధికారులు కనుగొన్నారు. దీంతో ఆమెను హత్యకు కుట్ర పన్నడం వంటి అభియోగాలపై అరెస్టు చేశారు. అయితే విక్టోరియా తన భర్త విషయంలో అసంతృప్తిగా ఉందని, ఆ బంధం నుంచి శాశ్వతంగా బయటకు రావాలని కోరుకున్నదని తెలుస్తోంది. అయితే అలాంటప్పుడు ఆమె విడాకులు తీసుకోకుండా, ఇలా ఏకంగా భర్త హత్యకు కుట్ర పన్నడం ఎందుకు? అనేది తెలియాల్సి ఉంది.
ఒకవైపు భార్య కుట్ర… మరోవైపు భర్త ప్రేమ
ఆరోన్ కాలిఫోర్నియాలో ‘ఘోస్ట్ అడ్వెంచర్స్’ సినిమా చేస్తున్నప్పుడు ఈ ప్లాన్ బయటపడింది. విక్టోరియా హిట్ మ్యాన్ కు ఆరోన్ బయట ఉన్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు… ఇలా ఎప్పటికప్పుడు అతను ఎక్కడ ఉన్నాడనే వివరాలను అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమె హిట్ మ్యాన్ కు 2,500 డాలర్ల డౌన్ పేమెంట్ కూడా పంపింది. ఓవైపు ఇదంతా జరుగుతుండగా, ఆరోన్‌కు తన భార్య ప్లాన్ గురించి ఏమీ తెలియదు. అతను సంతోషంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విక్టోరియాతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నాడు. వాటిలో వాలెంటైన్స్ డే పోస్ట్ కూడా ఉంది. దీంతో విక్టోరియా ఇలా భర్త హత్యకు కుట్ర పన్నడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.
అరెస్టు అయిన తర్వాత విక్టోరియా హత్య కుట్ర ఆరోపణలను ఖండించింది. తన భర్త లేకుండా జీవితం గురించి తాను పగటి కలలు కంటున్నానని, అతన్ని చంపాలని ఎప్పుడూ అనుకోలేదని ఆమె పేర్కొంది. అలాగే తాను అలా మెసేజ్ చేయడానికి తనలో ఉన్న బాధ కారణమని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మరిన్ని వివరాలను వెలికితీసేందుకు అధికారులు ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నారు.