Hari Hara Veera Mallu: ఈరోజుల్లో ముందుగా మేకర్స్ ఒక విడుదల తేదీని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత దానిని పోస్ట్‌పోన్ చేయడం ట్రెండ్ అయిపోయింది. పాన్ ఇండియా స్టార్ సినిమాలు మాత్రమే కాదు.. యంగ్ హీరోలు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మొదట్లో ప్రేక్షకులకు ఇదంతా చూసి విసుగు వచ్చినా మెల్లగా వారికి కూడా అలవాటు అయిపోయింది. ఒక సినిమా ఒకసారి పోస్ట్‌పోన్ అయ్యిందంటే అది మళ్లీ పోస్ట్‌పోన్ అవుతుందని కూడా ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈ పోస్ట్‌పోన్ విషయంలో ఒక తెలుగు సినిమా ఒక కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అదే ‘హరి హర వీరమల్లు’. 11వ సారి పోస్ట్‌పోన్ అయిన ఈ మూవీ.. మరో కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నట్టు సమాచారం.
వర్కవుట్ అవ్వట్లేదు
దాదాపు మూడేళ్ల క్రితం ‘హరి హర వీరమల్లు’ సినిమా చేయడానికి సైన్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇందులో ఒక యుద్ధ వీరుడిగా కనిపించడం కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సీరియస్‌గా పాల్గొన్నాడు. ట్రైన్ అయ్యాడు. ట్రైనింగ్ కోసమే చాలాకాలం గడిపాడు. ఆ తర్వాత షూటింగ్ కూడా మొదలయ్యింది. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా మొదలయ్యింది. కొన్నాళ్ల పాటు షూటింగ్ సాఫీగానే సాగిపోయింది. అంతలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారాల్లో బిజీ అయ్యాడు. అయినా కూడా ఎలాగైనా ఈ షూటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాలని పవన్ ఉన్న ప్రతీచోట ‘హరి హర వీరమల్లు’ సెట్ వేయించడానికి కూడా నిర్మాత సిద్ధమయ్యాడు. అయినా అది వర్కవుట్ అవ్వలేదు.
అయోమయంలో సినిమా
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత పూర్తిగా తన సినిమాలను పక్కన పెట్టేశాడు. దాని వల్ల దర్శకుడు క్రిష్ కాల్ షీట్స్ వేస్ట్ అవుతూ వచ్చాయి. అందుకే మూవీ టీమ్‌తో మాట్లాడి, నిర్మాతతో చర్చించి తనను పక్కకు తప్పుకున్నాడు. ఇంకా ఏ ఇతర దర్శకుడు వచ్చినా పవన్ కాల్ షీట్స్ ప్రకారం పనిచేయడం కష్టమని తన కుమారుడు ఏఎమ్ జ్యోతికృష్ణనే ‘హరి హర వీరమల్లు’కు దర్శకుడిగా మార్చారు ఏఎమ్ రత్నం. అయినా కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయారు. ఎన్నికల ప్రచారం ముగిసింది, ఎన్నికలు ముగిశాయి, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అలా ‘హరి హర వీరమల్లు’ భవిష్యత్తు మరింత అయోమయంలో పడింది.
Also Read: అందులోనూ రికార్డ్ సాధించిన ‘హరి హర వీరమల్లు’.. ఇలా కూడానా.?
అప్పుడే రిలీజ్
ఇప్పటివరకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) దాదాపు 10 సార్లు వాయిదా పడింది. ఇక 2025 మే 9న ఈ మూవీ రిలీజ్ అవ్వడం పక్కా అని మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్‌లో కూడా మూవీ రిలీజ్ కష్టమే అని అర్థమవుతోంది. మొత్తానికి 11వ సారి కూడా ఈ మూవీ పోస్ట్‌పోన్ అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి. ఇక కొత్త రిలీజ్ డేట్ విషయానికొస్తే.. మే 23న అయినా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మే 23కు కూడా ఎక్కువగా టైమ్ లేదు కాబట్టి ఆరోజు కూడా ‘హరి హర వీరమల్లు’ కష్టమే అని చాలామంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.