The Paradise Glimpse: ఈరోజుల్లో ఏదైనా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్.. ఇలా ఏది విడుదలయినా కూడా కాసేపటిలోనే ట్రెండ్ అయిపోతుంది. అది కూడా ఒక స్టార్ హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదలయ్యిందంటే అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లక తప్పదు. తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విషయంలో కూడా అదే జరిగింది. నాని హీరోగా వస్తున్న సినిమా అంటే కచ్చితంగా దానికోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలాంటి ప్రేక్షకులకు ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌తో షాకిచ్చాడు ఈ హీరో. అంతే కాకుండా ఈ గ్లింప్స్‌లో మెయిన్ హైలెట్‌గా నిలిచిన వాయిస్ ఎవరిదో కూడా బయటపడింది.
తను ఎవరంటే?
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ పూర్తిగా కాకుల చుట్టూ తిరుగుతోంది. ఇది ఒక కాకి కథ అని చెప్తూ ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. కానీ ఈ మూవీ మాత్రం పూర్తిగా కాకుల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా గ్లింప్స్‌లోని డైలాగుల వల్ల అర్థమవుతోంది. ఆ డైలాగులు ఎంత డెప్త్ ఉన్నాయో.. అది చెప్పినవారి వాయిస్ కూడా అంతే గంభీరంగా ఉంది. అయితే ఈ గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. ఈ డైలాగులు చెప్పేది సినిమాలో నానికి తల్లి పాత్రలో నటించిన నటి అని అర్థమవుతోంది. కానీ ఆ నటి ఎవరు అని మేకర్స్ బయటపెట్టలేదు. అయినా ‘ది ప్యారడైజ్’లో నాని తల్లి తనే అంటూ ఒక మరాఠి నటి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పేరే సోనాలి కులకర్ణి.
మరాఠి నటి
పూణెలో పుట్టి పెరిగినా కూడా నటిగా మరాఠి ఇండస్ట్రీలోనే ఎక్కువగా సంపాదించుకున్న నటి సోనాలి కులకర్ణి. మరాఠిలో మాత్రమే కాదు.. హిందీలో భాషలో కూడా సోనాలికి మంచి పాపులారిటీ ఉంది. ఇక నార్త్‌లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తమిళ లాంటి సౌత్ భాషలో కూడా సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం చేసింది సోనాలి. మిగతా నటీమణుల లాగా కాకుండా తన పాత్ర చిన్నదే అయినా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండాలని సోనాలి అనుకుంటుంది. అందుకే నెగిటివ్ రోల్స్‌లో నటించడానికి అయినా వెనకాడదు. సోనాలి కులకర్ణి (Sonali Kulkarni) చివరిగా ‘మాన్వత్ మర్డర్స్’ అనే వెబ్ సిరీస్‌లో లీడ్‌గా నటించి మెప్పించింది సోనాలి.
Also Read: కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ‘ది ప్యారడైజ్’ మలయాళం గ్లింప్స్.. చిక్కుల్లో పడ్డ నాని
తల్లి పాత్రకు ప్రాముఖ్యత
ఇక ‘ది ప్యారడైజ్’ (The Paradise)లో నానికి తల్లిగా నటించడం కోసం సోనాలి కులకర్ణి లాంటి మరాఠి నటిని ఎంపిక చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అలాగే ‘ది ప్యారడైజ్’లో నాని పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. తన తల్లి పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీ కోసం మొదటిసారిగా పూర్తిస్థాయిలో మేక్ ఓవర్ అయ్యాడు నాని. షర్ట్ లేకుండా, కండలు చూపిస్తూ, రెండు జడలు వేసుకొని చాలా డిఫరెంట్ లుక్‌తో ఈ గ్లింప్స్‌లో కనిపించాడు. అలా నాని లుక్ కూడా ‘ది ప్యారడైజ్’పై అంచనాలు పెంచేస్తోంది.