Kerala : సహజ వాతావరణ మార్పులతో పాటు అశాస్త్రీయ మానవ తప్పిదాలతో.. సారవంతమైన నేలలు క్రమంగా ఎడారీకరణకు గురవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండగా.. దక్షిణ భారత దేశంలోని కేరళ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 11% లేదా దాదాపు 4,22,299 హెక్టార్ల భూమి ప్రస్తుతం ఎడారీకరణ దశలో క్షీణించిపోతుంది. ఈ క్షీణత జీవవైవిధ్య నష్టం, ఆహార అభద్రత, నీటి కొరత, మానవ-వన్యప్రాణుల సంఘర్షణలకు దారితీస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ అంశమే ఇప్పుడు దేశంలో పర్యావరణ పరిరక్షణ విషయంపై సరికొత్త ఆందోళనలను లేవనెత్తుతోంది.
ఒక్క కేరళ మాత్రమే కాదు.. దేశ మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 30% భూమి ఎడారీకరణకు లేదంటే క్షీణతకు గురవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల రాజ్యసభలో టీఎంసీ సభ్యుడు డేరిక్ ఓబ్రియన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. భారత్ కు చెందిన రాష్ట్రాలు, యూటీలలో, ఎడారీకరణ, భూమి క్షీణత (డీఎల్‌డీ) పై నిర్వహించిన సర్వేపై.. వివరాలు తెలిపిన మంత్రి… దేశంలోనే అత్యధికంగా జార్ఖండ్ – 68.77%, రాజస్థాన్ – 62.06%, దిల్లీ – 61.73%, గోవా – 52.64% శాతం ఎడరీకరణను ఎదుర్కొంటుంటే.. వాటి తర్వాత గుజరాత్ – 52.22 %, నాగాలాండ్ – 50% ఎడారీకరణను ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు.
ఇందుకు అనేక కారణాలున్నాయంటారు పర్యావరణ శాస్త్రవేత్తలు.. అడవులను తోటలుగా మార్చడం వంటి అశాస్త్రీయ భూ వినియోగ మార్పులు సమస్యను తీవ్రతరం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే.. వివిధ అంశాలను పరిశీలిస్తున్న కేరళ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిపుణులు.. కేరళలో ఈ తోటలుగా మారుతున్న అడవుల శాతం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. కొండచరియలు విరిగిపడటం వంటి సహజ ప్రమాదాలు కూడా ఈ సమస్యకు పెంచుతున్నాయని అంటున్నారు. ఇలానే భూమి క్షీణతకు గురైనా, ఎడారీకరణ భారీన పడుతున్నా… రానున్న రోజుల్లో జన జీవనంతో పాటు పశుపక్షాదులు తీవ్ర పరిణామానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
దక్షిణ భారత్ లో కేరళలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉండగా.. ఇక్కడ ఎడారీకరణకు గురవుతున్న భూమి 2003-05లో 9.54% ఉండగా.. 2018-19 నాటికి 10.87%కి పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ తెలుపుతోంది. కేరళలో ఎడారీకరణను అశాస్త్రీయ భూ వినియోగ మార్పులు తీవ్రతరం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటవీ ప్రాంతాలు శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు లేకుండా తోటలుగా, ముఖ్యంగా రబ్బరు, యూకలిప్టస్ తోటలుగా మార్చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పరిణామాలు చాలా వేగంగా, తీవ్రంగా ఉంటున్నాయి. పశ్చిమ కనుమలలోని పురాతన వృక్ష సంపద, వన్యప్రాణుల ఆవాసాలపై ప్రతికూలంగా ప్రభావితం చేసే, మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను పెంచే అవకాశాలు ఏటికేటా పెరిగిపోతున్నాయని అంటున్నారు.
ఎడారీకరణకు మానవ తప్పిదాలతో పాటు ప్రకృతి సహజ ప్రమాదాలు కారణమని జియోహజార్డ్ నిపుణులు చెబుతున్నారు. అధిక వర్షపాతం వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు ఏటికేటా పెరిగిపోతుండడం వల్ల అటవీ నిర్మూలనతో పాటుగా సహజ వృక్షసంపద నాశనానికి కారణం అవుతుంది అంటున్నారు. కొండచరియలు విరిగిపోయినప్పుడల్లా.. కొండవాలు ప్రాంతంలోని పెద్ద ఎత్తున చెట్లు కొట్టుకుపోవడంతో పాటు సారవంతమైన నేలలు సైతం కోతకు గురవుతుంటాయని.. దాంతో, ఆయా భూములు క్రమంగా ఎడారీకరణకు కారణంగా నిలుస్తాయని అన్నారు.
Also Read : PM Modi : ఇండియన్ ఇండస్ట్రీకి ప్రధాని మోదీ క్లాస్ – ఇలా ఉంటేనే మనకు లాభం
ఈ సమస్యను అలాగే వదిలి పెట్టకుండా.. సమస్యను సరిచేసేందుకు మరింత కృషి చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేరళలో ఎడారీకరణ ప్రభావాన్ని తగ్గించడానికి అటవీకరణ ప్రయత్నాలను వేగవంతం చేయాలని అన్నారు. అలాగే.. నీటి నిర్వహణను మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎడారీకరణను నివారించేందుకు, నెమ్మదించేందుకు.. కృత్రిమ నీటి సేకరణ పద్ధతులను అమలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. దీంతో.. ఇది జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు, ఎడారీకరణతో సంబంధం ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు సహాయపడుతుందని అంటున్నారు.