Chiranjeevi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎవరి సహాయం లేకుండా అడుగుపెట్టారు చిరంజీవి (Chiranjeevi). అలా తన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచిన మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో పాటు పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ అవార్డు కూడా దక్కించుకున్న ఈయన ఇటీవల గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నా సరే వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి(Vashishtha mellidi) దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అభిమానులలో ఆసక్తిని పెంచాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
అనిల్ రావిపూడి తో చిరంజీవి సినిమా..
ఇకపోతే విశ్వంభర సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా చిరంజీవి లైనప్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం.అనిల్ రావిపూడి ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇందులో వెంకటేష్ (Venkatesh) హీరోగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి సూపర్ హిట్ గా నిలిచి రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయబోతున్నారని సమాచారం.
బాబీతో కాంబో రిపీట్ చేయనున్న చిరంజీవి..
ఇకపోతే అనిల్ రావిపూడి తర్వాత చిరంజీవి మరోసారి ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు బాబి కొల్లి (Bobby kolli). ఈయనతో గతంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దీనికి తోడు బాబి తాజాగా బాలకృష్ణ (Balakrishna) తో ‘డాకు మహారాజ్’ సినిమా చేశారు.ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబి తో మళ్ళీ చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం చిరంజీవి, బాబీ కాంబినేషన్లో మూవీ అంటూ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి కెరియర్..
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. నటుడి గానే కాకుండా ఎంతో మందికి అండగా నిలుస్తూ గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు దక్కించుకున్నారు. ఇక సినిమాలలోనే కాదు గతంలో రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టిన చిరంజీవి, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కానీ బ్లాక్ బాస్టర్ విజయం మాత్రం ఆయన ఖాతాలో ఇప్పటివరకు పడలేదని చెప్పాలి. అందుకే ఇప్పుడు మళ్లీ యంగ్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు చిరంజీవి. మరి చిరంజీవి మునుముందు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.