Vidhya Balan..బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ (Vidya Balan) అంటే సౌత్ ఇండస్ట్రీలో ఉండే ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈమె కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా పేరున్న హీరోయిన్.. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్(Sr.NTR) బయోపిక్ గా తెరకెక్కిన ‘కథానాయకుడు’ (Kathanayakudu) సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం(Basavatarakam ) రోల్ లో విద్యాబాలన్ కనిపించింది. అలాగే ఈమె ఇండస్ట్రీలోకి సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మలయాళం లో మొదట మోహన్ లాల్ (Mohan Lal) సినిమాకి సైన్ చేసినప్పటికీ, ఆ సినిమా నిర్మించడంలో ఇబ్బందులు రావడంతో మలయాళ ఇండస్ట్రీలో విద్యాబాలన్ కి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన విద్యా బాలన్.. తాజాగా తన వీడియోల గురించి సంచలన వీడియో పోస్ట్ చేసింది.
అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు – విద్యాబాలన్..
విద్యాబాలన్ అందులో మాట్లాడుతూ.. “ఈ మధ్యకాలంలో ఏఐ జనరేటెడ్ తో ఫోటోలు, వీడియోలు చాలా అసభ్యంగా వస్తున్నాయి. అయితే నాకు సంబంధించిన పలు ఏఐ ఫొటోస్,వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆ ఫోటోలతో, వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే వాటిని ప్రమోట్ చేయడంలో కూడా నా హస్తం లేదు. అవన్నీ ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మాత్రమే. ఇక అందులో ఉండే కంటెంట్ కూడా నేను అస్సలు అంగీకరించను. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అందుకే వాటిని అస్సలు షేర్ చేయకండి. ఒకవేళ షేర్ చేయాల్సి వస్తే అందులో ఉన్న నిజం ఎంత అని ముందుగా తెలుసుకోండి. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల పట్ల అప్రమత్తంగా ఉండండి”.. అంటూ విద్యాబాలన్ ఒక షాకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.
డీప్ ఫేక్ బారిన పడ్డ సెలబ్రిటీస్ వీరే..
ఇక విద్యాబాలన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు విద్యాబాలన్ ఇచ్చిన సందేశం చూసి ఇప్పటికైనా అలాంటి వీడియోలను, ఫోటోలను షేర్ చేయడం ఆపండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎప్పుడైతే ఏఐ క్రియేటివిటీ ఎక్కువైపోయిందో అప్పటి నుండి చాలామంది నటీనటులు ఇలా డీప్ ఫేక్ కి గురవుతున్నారు. ఇప్పటికే కత్రినా కైఫ్(Katrina Kaif), అలియా భట్(Alia Bhatt),దీపిక పదుకొనే(Deepika Padukone), రష్మిక మందన్నా(Rashmika Mandanna) వంటి హీరోయిన్లు ఈ డీప్ ఫేక్ కి గురయ్యారు. హీరోయిన్ల ఏఐ ఫొటోస్, వీడియోస్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారు కొంతమంది. కానీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాంటి వీడియోలను షేర్ చేయడం ఆపేయండి అంటూ విద్యాబాలన్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇక విద్యా బాలన్ సినిమాల విషయానికి వస్తే.. కార్తీక్ ఆర్యన్ హీరోగా చేసిన భూల్ భులయ్యా -3(Bhool Bhulaiyaa -3)అనే మూవీలో గత ఏడాది విద్యాబాలన్ కనిపించింది. ఇక ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా చీరకట్టుతో మెరిసే విద్యాబాలన్ చీరకట్టుకు ట్రేడ్ మార్క్ గా మారిపోయింది.