Baby John: ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల మార్కెట్‌ను కాపాడింది రీమేక్ సినిమాలే. ఏ భాష నుండి సినిమాలను రీమేక్ చేసినా వాటిని హిందీ ప్రేక్షకులు తెగ ఆదరించేవారు. అలా కొంతకాలం పాటు రీమేక్ అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే పేరు వచ్చేసింది. కానీ రోజులు మారిపోయాయి. ఈరోజుల్లో ఏ సినిమా విడుదలయినా దానిని ఒరిజినల్ భాషలోనే చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. భాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేసేస్తున్నారు. అందుకే తాజాగా భారీ హైప్ మధ్య బాలీవుడ్‌లో విడుదలయిన ‘బేబి జాన్’ మూవీ డిశాస్టర్ వైపుకు అడుగులేస్తోంది. ఇంతలోనే ఈ సినిమాకు సౌత్ చిత్రాల నుండి గట్టి పోటీ కూడా మొదలయ్యింది.
ఎన్నో అడ్డంకులు
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘బేబి జాన్’ మూవీ విడుదలయ్యింది. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని మేకర్స్ అంతా ప్రమోషన్స్ విషయంలో చాలానే కష్టపడ్డారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తేరీ’ని హిందీలో ‘బేబి జాన్’ (Baby John) పేరుతో రీమేక్ చేశారు. ‘తేరీ’లో కథ, విజయ్ యాక్టింగ్.. ఇలా ఎన్నో అంశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా హిందీలో కూడా హిట్ అవుతుందనే ఆలోచనతో దర్శకుడు అట్లీ.. స్వయంగా నిర్మాతగా మారి ‘బేబి జాన్’ను నిర్మించాడు. కానీ దీని వల్ల తనకు నష్టాలే మిగిలాయి. అంతే కాకుండా విడుదలయినప్పటి నుండి ఈ మూవీకి ఎన్నో అడ్డంకులు కూడా వస్తున్నాయి.
Also Read: ‘గేమ్ చేంజర్’తో బాలయ్య.. అన్‌స్టాపబుల్ కాంబో సెట్
మొదట్లో ‘పుష్ప 2’
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలయ్యింది. దాదాపు మూడు వారాల పాటు ఏ పోటీ లేకుండా దేశవ్యాప్తంగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. అదే సమయంలో ‘పుష్ప 2’ జోరు తగ్గిందనుకొని ‘బేబి జాన్’ను రంగంలోకి దించారు మేకర్స్. కానీ విడుదలయిన తర్వాత ‘బేబి జాన్’ చాలామందిని మెప్పించలేకపోయింది. దీంతో ప్రేక్షకుల ఓట్లు మళ్లీ ‘పుష్ప 2’కే పడ్డాయి. ఇప్పుడు మరో సౌత్ మూవీ.. ‘బేబి జాన్’కు పోటీగా రంగంలోకి దిగింది. అదే ‘మార్కో’. మలయాళ సినిమా అయిన ‘మార్కో’ ఇటీవల విడుదలయ్యి మోస్ట్ వైలెంట్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో హిందీ ప్రేక్షకులు సైతం దీని డబ్బింగ్ వర్షన్‌ను చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు.
‘మార్కో’పై ప్రశంసలు
‘పుష్ప 2’, ‘మార్కో’ (Marco) సినిమాలకు మంచి టాక్ వస్తుండడంతో థియేటర్ల నుండి ‘బేబి జాన్’ను తీసేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఓనర్లు. ముఖ్యంగా ఇటీవల విడుదలయిన ‘మార్కో’ అయితే కేవలం హిందీ బాక్సాఫీస్‌పై మాత్రమే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌పై దండయాత్ర మొదలుపెట్టింది. ‘కిల్’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో పోలుస్తూ ‘మార్కో’ను తెగ ప్రశంసించేస్తున్నారు ప్రేక్షకులు. ఆదివారం నుండి ‘మార్కో’కు రోజుకు 5 షోలు ఇచ్చి.. ‘బేబి జాన్’కు మాత్రం 3 షోలే ఇవ్వనున్నారు. దీంతో రెండు సౌత్ సినిమాల మధ్య ఒక హిందీ సినిమా నలిగిపోతుందని సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.