Dilraju:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు (Dil raju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ ఊహించని పాపులారిటీ దక్కించుకున్న ఈయన, ఇటీవల టీ.ఎఫ్.డీ.సీ.చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు దిల్ రాజు పని అయిపోయింది అని అన్న చాలా మందికి ఈ సంక్రాంతి గట్టి కం బ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram charan) హీరోగా, శంకర్ (Shankar ) దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Gamechanger), అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇలా రెండు చిత్రాలను ఆయనే నిర్మించారు. ఈ సినిమాల ఫలితాలతో సంతోషంలో ఉన్న దిల్ రాజుకు ఐటి అధికారులు షాక్ ఇచ్చారు.
దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదా..
హైదరాబాదులోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితోపాటు నగరంలో పలుచోట్ల ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా నగరవ్యాప్తంగా 55 బృందాలుగా విడిపోయి.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇల్లు, ఆఫీసులు అన్నింటిని కూడా అధికారులు సోదా చేస్తున్నారు. ఇక దిల్ రాజుతోపాటు శిరీష్ (Sirish), దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి (Hansitha reddy ) నివాసాలలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఏడాది సినిమాలు నిర్మించి సంతోషంలో ఉన్న దిల్ రాజుకు ఐటి అధికారులు పెద్ద షాక్ ఇచ్చారని నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
దిల్ రాజు కెరియర్..
దిల్ రాజు విషయానికి వస్తే.. వెంకటరమణారెడ్డి అనే ఈయన డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి నితిన్ (Nithin) హీరోగా వచ్చిన ‘దిల్’ సినిమా చేశారు.ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో దిల్ రాజుగా తన పేరును మార్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగిన ఈయన భారీ ఆదాయం సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు.. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ.. నిర్మాతలకు, సినీ ఇండస్ట్రీకి ఏ ఇబ్బందులు కలగకుండా.. అటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు.
దిల్ రాజు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే..
దిల్ రాజు మొదటి భార్య అనిత (Anita) 2017లో గుండెపోటుతో మరణించగా.. వీరికి హన్సిత అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఈమె కూడా దిల్ రాజు నిర్మించే చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హన్సితాకి కూడా ఒక కొడుకు జన్మించారు. ఇక 2020లో తోడు కోసం వెతుకులాటలో నిజామాబాదులో ఒక గుడిలో వైగారెడ్డి అలియాస్ తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఈ దంపతులకు కూడా 2022 జూన్ 29వ తేదీన అన్వీ రెడ్డి అనే కొడుకు కూడా జన్మించారు. ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ కలెక్షన్లు వసూలు చేసుకున్న దిల్ రాజు.. చిత్ర బృందం, భార్య, కొడుకుతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 మైత్రి మూవీ సంస్థపై కూడా దాడి..
పుష్ప2 మూవీ మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
సింగర్ సునీత భర్త సంస్థ పై కూడా దాడులు..
మరోవైపు పాపులర్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని సంస్థ అయిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.